
న్యూఢిల్లీ: దేశీయ కార్పొరేట్ రంగం ప్రతికూలతల నుంచి బయటపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు తమ మూలధన వ్యయ ప్రణాళికలను అమల్లోకి తేవటం మొదలెట్టాయి. అస్థిర మార్కెట్లు, చమురు ధరలు పెరగడం తదితర అంశాల కారణంగా ఏడాది పాటు స్తబ్ధత నెలకొనగా... ఇపుడిపుడే మళ్లీ పెట్టుబడుల పునరుద్ధరణ దిశగా అడుగులేస్తున్నాయి. టాటా స్టీల్, అంబుజా సిమెంట్స్, ఐషర్ మోటార్స్, హీరో మోటో కార్ప్, ఏషియన్ పెయింట్స్, సియట్, అపోలో టైర్స్, జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్ తదితర కంపెనీలు వెల్లడించిన పెట్టుబడుల ప్రణాళికల మొత్తం రూ.50,000 కోట్లపైనే ఉంది. జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ గత ఆర్థిక సంవత్సరంలో స్టోర్ల విస్తరణ జోలికే వెళ్లలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో మాత్రం 75 స్టోర్లను ప్రారంభించే ప్రణాళికతో ఉంది. ఇందుకోసం రూ.150 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. గత మార్చి త్రైమాసికంలో కంపెనీ ఆదాయ వృద్ధి ఆరేళ్ల గరిష్ట స్థాయికి చేరడం కంపెనీ విస్తరణ ప్రణాళికలకు ప్రోత్సాహాన్నిచ్చింది. మార్చి క్వార్టర్లో కంపెనీ వృద్ధి 26.6%గా ఉంది. అధిక సామర్థ్య వినియోగం, డిమాండ్ ఆశాజనకంగా ఉండడం వంటి అంశాలు కంపెనీలను విస్తరణ దిశగా పురికొల్పాయని విశ్లేషకులు చెబుతున్నారు.
భారీ తగ్గుదల
బీఎస్‌ఈ 200 కంపెనీల (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ కంపెనీలు మినహా) మూలధన పెట్టుబడుల్లో వృద్ధి రేటు 2010–11 నుంచి 2016–17 మధ్య 7 శాతం లోపునకు పడిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడులను మినహాయించి చూస్తే వృద్ధి రేటు 2 శాతమే. రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున చేసిన పెట్టుబడులతో వృద్ధి రేటు ఈ మాత్రమైనా కనిపిస్తోంది. నిజానికి 2003 ఆర్థిక సంవత్సరం నుంచి 2011 ఆర్థిక సంవత్సరం మధ్య మూలధన పెట్టుబడుల వృద్ధి చాలా వేగంగా 35 శాతం చొప్పున పెరుగుతూ వచ్చింది. 2017–18 సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీయ కంపెనీల స్థూల క్యాపిటల్ ఫార్మేషన్ (ఆస్తులపై చేసే పెట్టుబడులు) దశాబ్ద కనిష్ట స్థాయి అయిన 27 శాతానికి పడిపోయినట్టు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ వెల్లడించింది. మెరుగైన ఆర్థిక వృద్ధికి క్యాపిటల్ ఫార్మేషన్ రేటు 40 శాతానికి పైగా ఉండాలి. అయితే, పరిశ్రమ పరిశీలకులు మాత్రం పరిస్థితిలో మార్పు వచ్చిందని, మరింత మూలధ పెట్టుబడుల వృద్ధి ఉండొచ్చని చెబుతున్నారు. కొన్ని రంగాలు పుంజుకోవడం, ప్రభుత్వ మద్దతు కొనసాగడం సానుకూలతలుగా పైన్‌ఓక్ క్యాపిటల్ పార్ట్‌నర్ అమిత్ తివారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment