ఇన్ఫీలో వివక్షపై మాజీ ఉద్యోగి దావా
బెంగళూరు: దక్షిణాసియాయేతర ఉద్యోగులపై వివక్ష చూపిస్తోందంటూ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై సంస్థ మాజీ ఉద్యోగి దావా వేశారు. దక్షిణాసియా వారికి అందునా భారతీయ ఉద్యోగులకే ప్రాధాన్యమిస్తోందంటూ ఇమ్మిగ్రేషన్ విభాగం అధిపతిగా పనిచేసిన ఎరిన్ గ్రీన్ పిటీషన్‌లో పేర్కొన్నారు. గ్లోబల్ ఇమిగ్రేషన్ వాసుదేవ నాయక్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బినోద్ హంపాపూర్‌లపై ఈ మేరకు ఆయన ఆరోపణలు చేశారు. తాను నాలుగున్నరేళ్ల పాటు ఇన్ఫీలో పనిచేశానని, క్రమశిక్షణ ఉల్లంఘనలాంటి రికార్డు కూడా ఏమీ లేకపోయినప్పటికీ ..
ముందస్తు హెచ్చరికలేమీ చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా కంపెనీ తనను తొలగించిందని పేర్కొన్నారు. విధుల్లో భాగంగా నాయక్‌కు గ్రీన్ రిపోర్టు చేసేవారు. నాయక్ గతేడాది ఇన్ఫోసిస్ నుంచి తప్పుకున్నారు. నాయక్, హంపాపూర్ తనతో పాటు దక్షిణాసియాయేతర ఉద్యోగులపై వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్న సంగతి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినందుకు ప్రతీకారంగానే తనను తొలగించారని గ్రీన్ ఆరోపించారు. మరోవైపు, విషయం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున తాము వ్యాఖ్యానించబోమని ఇన్ఫోసిస్ పేర్కొంది.