‘క్రిస్’కు ఇన్ఫోసిస్ వీడ్కోలు | Infosys fetes founding fathers as Kris Gopalakrishnan retirement day nears | Sakshi
Sakshi News home page

‘క్రిస్’కు ఇన్ఫోసిస్ వీడ్కోలు

Published Thu, Oct 9 2014 1:39 AM | Last Updated on Mon, Oct 1 2018 5:14 PM

‘క్రిస్’కు ఇన్ఫోసిస్ వీడ్కోలు - Sakshi

‘క్రిస్’కు ఇన్ఫోసిస్ వీడ్కోలు

 బెంగళూరు: సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో వ్యవస్థాపకుల శకం పూర్తిగా ముగిసింది. తాజాగా క్రిస్ గోపాలకృష్ణన్ పదవీ విరమణ చేశారు. దీంతో మొత్తం వ్యవస్థాపకులందరూ కంపెనీ నుంచి వైదొలిగినట్లయింది. బుధవారం ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో క్రిస్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘ఇప్పుడంతా కంప్యూటర్లమయంగా మారింది. ఇది భారీ పరిశ్రమగా రూపొందింది. డెబ్భై సంవత్సరాల ఈ రంగంలో దాదాపు 35 ఏళ్ల పాటు భాగమవడం నా అదృష్టం’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇన్ఫోసిస్ ఏర్పాటు, కొత్త ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా పరిశ్రమపై తమదైన ముద్ర వేయగలిగామని క్రిస్ పేర్కొన్నారు.

భవిష్యత్ ప్రణాళికలపై మాట్లాడుతూ.. పరిశోధన, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌పై దృష్టి పెట్టాలని యోచిస్తున్నట్లు తెలిపారు. నీలేకని తదితర మాజీ సహచరుల తరహాలో తనకు రాజకీయాలపై ఆసక్తి లేదన్నారు. ఈ ఏడాది జూన్ 14న ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా వైదొలిగిన క్రిస్.. ఆ తర్వాత నుంచి కంపెనీలో నాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. మిగతా వ్యవస్థాపకులు నారాయణ మూర్తి, నందన్ నీలేకని, ఎన్‌ఎస్ రాఘవన్, ఎస్‌డీ శిబులాల్, కె. దినేష్‌లు కూడా ఈ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మూర్తి సహా వ్యవస్థాపక బృందం 1981లో ఇన్ఫోసిస్‌ను ప్రారంభించారు.
 
నభూతో నభవిష్యత్..
ఎంతో నిబద్ధతతో, ఎన్నో త్యాగాలకోర్చి ఏకంగా 33 ఏళ్ల పాటు ఒక సంస్థను తీర్చిదిద్దిన వ్యవస్థాపక సభ్యుల బృందాన్ని దేశం గతంలో ఎన్నడూ చూడలేదని, ఇకపై కూడా చూడకపోవచ్చని ఈ సందర్భంగా నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. ‘బోంబే స్టాక్ ఎక్స్చేంజీలో 1993లో ఈ సంస్థ లిస్టయినప్పుడు మార్కెట్ విలువ రూ. 28.5 కోట్లు. అక్కణనుంచి 2014లో రూ. 2,00,000 కోట్లకు పెరిగింది. అంటే 21 సంవత్సరాల్లో 6,50,000 శాతం మేర రాబడులు ఇచ్చినట్లు లెక్క. కంపెనీని ఇంత ఘనమైన స్థాయికి తీసుకొచ్చిన సంతృప్తితో వైదొలుగుతున్నాం’ అని ఆయన  చెప్పారు. ఈ నెల 10 దాకా నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగనున్న మూర్తి.. అటు తర్వాత నుంచి గౌరవ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మరోవైపు,  కస్టమర్ల అవసరాలను గుర్తెరిగి, వారితో సత్సంబంధాలు కొనసాగించడం ఏ వ్యాపారానికైనా కీలకమని, అదే తాను ఆచరణలో పెట్టానని నీలేకని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement