
ఇటీవలి మార్కెట్ కరెక్షన్‌లో అన్ని రకాల స్టాక్స్ దిద్దుబాటుకు గురయ్యాయి. దీర్ఘకాలం పాటు తమ పెట్టుబడులను ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని భావించే వారి ముందు, స్టాక్స్ విలువలు పడిపోయిన ప్రస్తుత తరుణంలో చక్కని అవకాశాలు ఉన్నాయి. మంచి పనితీరుతో కూడిన వ్యాల్యూ ఫండ్స్‌ను ఎంచుకోవడమే ఇన్వెస్టర్లు చేయాల్సిన పని. ఆ విధంగా చూసినప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్ బిల్డర్ వ్యాల్యూ ఫండ్ ఒక ఎంపికగా పరిశీలించొచ్చు. విలువల పరంగా ఆకర్షణీయంగా ఉన్న స్టాక్స్‌లో ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంది.
పనితీరు
ఈ పథకం రాబడులకు ప్రామాణిక సూచీ అయిన నిఫ్టీ 500 (టోటల్ రిటర్న్ ఇండెక్స్). కనీసం 50 శాతం నిధులను స్టాక్స్ సగటు విలువల కంటే తక్కువ (పీఈ/పీబీ)కు లభించే వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ పథకం తాజా పోర్ట్‌ఫోలియో పీఈ రేషియో 18.5 రెట్లుగా ఉంది. బెంచ్ మార్క్ పీఈ 24తో పోలిస్తే తక్కువలో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్ బిల్డర్ వ్యాల్యూ పథకం... ఇదే విభాగంలోని ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ప్యూర్ వ్యాల్యూ ఫండ్, ఎల్‌అండ్‌టీ ఇండియా వ్యాల్యూ ఫండ్‌తో పోలిస్తే ఐదేళ్ల కాల పనితీరులో వెనుకబడి ఉంది.
కానీ, ఏడాది, మూడేళ్ల కాల పనితీరు పరంగా చూస్తే మిగిలిన పథకాల కంటే మెరుగ్గా ఉంది. ఏడాది కాలంలో చూసుకుంటే బెంచ్ మార్క్ రాబడులకు సమీపంలో ఉండగా, మూడేళ్ల కాలంలో మాత్రం 11.27 శాతం సగటు వార్షిక రాబడులను అందించింది. మూడేళ్లలో నిఫ్టీ 500 రాబడులు 9.94 శాతమే. ఐదేళ్లలో ఈ పథకం రాబడులు వార్షికంగా 18.47 శాతం కాగా, బెంచ్ మార్క్ రాబడులు 14.99 శాతంగా ఉన్నాయి.
పెట్టుబడుల విధానం
2012 ర్యాలీలో ఈ పథకం బెంచ్ మార్క్‌తో పోలిస్తే పనితీరు పరంగా వెనుకబడింది. మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో తక్కువ ఎక్స్‌పోజర్ కలిగి ఉండటం వల్లే అలా జరిగింది. కానీ, నాటి అనుభవంతో 2014, 2017 ర్యాలీల్లో నిఫ్టీ 500ను పనితీరుతో వెనక్కి నెట్టేసింది. తన పోర్ట్‌ఫోలియోలో మూడింట ఒక వంతు మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌ను కలిగి ఉంటోంది. అయితే, ఈ ఏడాది నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల వంటి సందర్భాల్లో భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే స్టాక్స్‌లోకి ఎక్స్‌పోజర్ మళ్లించే విధానాన్ని అనుసరిస్తోంది.
ఈ ఏడాది మిడ్, స్మాల్ క్యాప్‌లో పెట్టుబడులను 26 శాతానికి తగ్గించుకుంది. అంతేకాదు మొత్తం మీద ఈక్విటీ పెట్టుబడులను కూడా కొంత తగ్గించింది. ఈక్విటీల్లో 90–95 శాతం మధ్యే పెట్టుబడులు ఉన్నాయి. 2013, 2015లోనూ ఇదే తరహా విధానాన్ని అనుసరించింది. సాధారణంగా ఈ పథకం 50–60 స్టాక్స్‌ను తన పోర్ట్‌ఫోలియోలో కొనసాగిస్తుంటుంది. గడిచిన రెండు సంవత్సరాలుగా 8–10 శాతం పెట్టుబడులను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులోనే కొనసాగిస్తూ వస్తోంది.
బ్యాంకింగ్ రంగంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఈ కాలంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్ క్రమంగా పెరుగుతూ రావడం గమనార్హం. అన్ని మార్కెట్ సైకిల్స్‌లోనూ బ్యాంకింగ్ స్టాక్స్‌కు ప్రాధాన్యం కొనసాగిస్తోంది. అందులోనూ ప్రైవేటు బ్యాంకుల పట్ల సానుకూలంగా ఉంది. ప్రస్తుతం ఈ రంగంలో 23 శాతం పెట్టుబడులను కలిగి ఉంది. ఐటీ రంగంలో విప్రోను ఇటీవలే తన పోర్ట్‌ఫోలియోకు యాడ్ చేసుకుంది. ఇన్ఫోసిస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్‌లోనూ పెట్టుబడులు పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment