
శాన్‌ఫ్రాన్సిస్కో: ఆపిల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యంత ఖరీదులో లాంచ్ చేసిన ఐఫోన్ 10పై మరొకటి వార్త వెలుగు చూసింది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ మొదటి టెస్ట్‌లో కింద పడినపుడు పగిలిందన్న వార్తలకు తోడు ఇపుడు ఐ ఫోన్ అతి చల్లటి వాతావరణంలో పనిచేయడంలేదన్న వార్త ఐ ఫోన్ లవర్స్‌కు షాకింగ్ న్యూసే. ఎలాంటి వాతావారణంలోనైనా పనిచేయాల్సిన స్మార్ట్‌ఫోన్ తీవ్రమైన శీతల పరిస్థితుల్లో పనిచేయనని మొండికేస్తోందట. ఈ సమస్యపై ఆపిల్ కూడా స్పందించింది. త్వరలోనే దీన్ని పరిష‍్కరిస్తామని చెప్పింది.
అత్యంత ఖరీదు పెట్టి కొన్న ఐఫోన్10 అతి చల్లటి వాతావరణంలో పనిచేయడం లేదని కొంతమంది యూజర్లు ఫిర్యాదు చేశారు. చల్లటి వాతావరణంలోకి వెళ్లిన తరువాత రెండు సెకన్లకే టచ్ స్క్రీన్ పనిచేయలేదని ఒక వినియోగాదారుడు వాపోయాడు.
అయితే ఇలాంటి సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని,కానీ, కొద్ది సెకన్ల తరువాత పూర్తిగా యథావిధిగా ఉంటోందని ఆపిల్ పేర్కొంది. రాబోయే సాఫ్ట్‌వేర్ అపడేట్‌లో దీన్ని సవరించనున్నట్టు తెలిపింది. అంతేకాదు 0-35 డిగ్రీల సెల్సియస్ మధ్య వాడాలని కూడా సూచించింది. అతిశీతల, అతి ఉష్ణ వాతావరణంలో ఈ డివైస్ బ్యాటరీ కూడా తాత్కాలికంగా బలహీనపడే అవకాశం ఉందని, అయితే సాధారణ వాతావరణంలోకి వచ్చిన తరువాత మళ్లీ మామూలు స్థితికి వస్తుందని చెప్పింది
Comments
Please login to add a commentAdd a comment