న్యూఢిల్లీ : దేశీయ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్(ఐఆర్‌సీటీసీ) సేవలు స్తంభించిపోయాయి. నేటి ఉదయం నుంచి కొన్ని గంటల పాటు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ irctc.co.in, మొబైల్ ఫోన్ యాప్ ఆగిపోయాయి. ‘నిర్వహణ చర్య వల్ల ఈ-టిక్కెటింగ్ సర్వీసు ప్రస్తుతం అందుబాటులో లేదు. కొద్దిసేపు అయ్యాక ప్రయత్నించండి. క్యాన్సిలేషన్/టీడీఆర్ ఫైల్ కోసం కస్టమర్ కేర్ నెంబర్. 011-39340000,011-23340000 కు కాల్ చేయండి లేదా etickets@irctc.co.in కు మెయిల్ పెట్టండి’ అనే మెసేజ్ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో, యాప్‌లో దర్శనమిచ్చింది. అయితే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఏమైనా హ్యాకింగ్‌కు గురైందా? అనే సందేహాలు సోషల్ మీడియా వ్యాప్తంగా వ్యక్తమయ్యాయి.
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవడం కుదరకపోవడంతో, యూజర్లు సోషల్ మీడియాలో మండిపడ్డారు. రైల్వే మంత్రి పీయూష్ గోయల్, దేశీయ రైల్వేను కోట్ చేస్తూ.. యూజర్లు ట్వీట్లు చేశారు. ఎందుకు వెబ్‌సైట్, యాప్ పనిచేయడం లేదని ప్రశ్నించారు. యూజర్లు ఇంతలా ప్రశ్నించినప్పటికీ రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి గానీ, రైల్వే అధికారుల నుంచి గానీ ఇసుమంతైన సమాధానం రాకపోవడం గమనార్హం. అసలేమైందో కూడా వారు తెలుప లేదు. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్ యథాతథ స్థితికి వచ్చాయి. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్‌ల్లో నిర్వహణ కార్యకలాపాలను చేపడతామని దేశీయ రైల్వే నుంచి ముందస్తుగా ఎలాంటి ప్రకటన కూడా వెలువడ కాలేదు. ఎలాంటి ప్రకటనలు లేకుండా... ఇలా ఐఆర్‌సీటీసీ సేవలు నిలిచిపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఉదయం 11 గంటల నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్ క్రాష్ అయ్యాయి. గంటల కొద్దీ ఐఆర్‌సీటీసీ సైట్ డౌన్ అయినట్టే చూపించింది. సైట్ లేదా యాప్‌లో టిక్కెట్ క్యాన్సిలేషన్ కూడా అవ్వలేదు. కాగ, మే 2న కొన్ని ఫీచర్లను అప్‌డేట్ చేయడం కోసం దేశీయ రైల్వేకి చెందిన ఆన్‌లైన్ పోర్టల్స్‌ను, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను రాత్రి 10.45 నుంచి తర్వాత రోజు ఉదయం 5 గంటల వరకు మూసివేశారు. కానీ ప్రస్తుతం ఎందుకు ఈ సైట్ క్లోజ్ అయిందో తెలియక యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment