భారత్‌లో ఐటీకి అపార అవకాశాలు: సిస్కో
శాన్‌డీగో: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగ కంపెనీలకు భారత్‌లో అపార వ్యాపార అవకాశాలు ఉన్నాయని టెక్నాలజీ దిగ్గజం సిస్కో సీఈవో జాన్ ఛాంబర్స్ తెలిపారు. వర్ధమాన దేశాల్లో ఇన్వెస్ట్ చేయదల్చుకున్న కంపెనీలు ప్రధానంగా దృష్టి పెట్టొచ్చని ఆయన పేర్కొన్నారు. సిస్కో లైవ్ 2015 కార్యక్రమంలో కంపెనీ సీఈవో హోదాలో ఆఖరి కీలకోపన్యాసం చేసిన సందర్భంగా చాంబర్స్ ఈ విషయాలు చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమంతో లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతుందని వివరించారు. రాబోయే సీఈవో చక్ రాబిన్స్‌తో కలిసి త్వరలో భారత్‌లో పర్యటించనున్నట్లు తెలిపారు. సిస్కో ఆదాయాల్లో భారత మార్కెట్ వాటా 2 శాతంగా ఉంది.భారత్‌లో హైదరాబాద్ సహా బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో సిస్కోకి 10,000 మంది ఉద్యోగులు ఉన్నారు.