విద్యా సంస్థలకు మరింత స్వయం ప్రతిపత్తినివ్వాలి: ఇన్ఫీ మూర్తి
బెంగళూరు: విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వ జోక్యం తగ్గాలని, వాటికి మరింత స్వయం ప్రతిపత్తినివ్వాలని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. ఏది మంచి కళాశాల, ఏది కాదు అన్నది మార్కెట్, సమాజమే నిర్ణయించుకుంటాయని అంతే తప్ప ప్రభుత్వం వీటి ఏర్పాటులో జోక్యం చేసుకోకూడదని ఆయన పేర్కొన్నారు.
ఇన్ఫోసిస్ ప్రైజ్ 2014 విజేతలను ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మూర్తి ఈ విషయాలు తెలిపారు. ప్రొఫెసర్లు, పరిశోధకులు, యూనివర్సిటీల నిర్వాహకులకు పూర్తి స్థాయి స్వయం ప్రతిపత్తి అవసరమని.. ఏఐసీటీ, యూజీసీ వంటి సంస్థల పాత్రను తగ్గించాలని ఆయన పేర్కొన్నారు. కుప్పతెప్పలుగా పుట్టుకొస్తున్న స్కూళ్లు, కాలేజీల వల్ల విద్యాప్రమాణాలపై నియంత్రణ లేకుండా పోవచ్చన్న అంశంపై స్పందిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్నారు.
కానీ ప్రభుత్వ నియంత్రణ వల్ల పరిస్థితి మెరుగుపడకపోవచ్చని, ఏది మంచి..ఏది చెడు అన్న విషయంలో అంతిమ నిర్ణయం మార్కెట్‌దేనని మూర్తి పేర్కొన్నారు. పూర్తి స్థాయి స్వయం ప్రతిపత్తినిస్తే ప్రారంభంలో కొంత దుర్వినియోగం కావొచ్చని, కొంత మంది ఇబ్బంది పడవచ్చని కానీ అంతిమంగా మెరుగైన విద్యా వ్యవస్థ ఏర్పడగలదని ఆయన చెప్పారు.