
పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట : జైట్లీ
న్యూఢిల్లీ: పన్ను ఎగవేతలు, స్మగ్లింగ్‌కు అడ్డుకట్టవేయడం కోసం అంతర్జాతీయ సంస్థల నుంచి మరింత సహకారాన్ని తీసుకోవాలని రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. గురువారమిక్కడ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రెండో ప్రాంతీయ సదస్సును ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు.
స్వేచ్ఛా వాణిజ్యం సక్రమంగా జరగాలంటే పన్ను ఎగవేతలు, పన్నులను తప్పించుకునే ధోరణులకు చెక్ చెప్పాల్సిందేనన్నారు. ఇందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకోవడంతో పాటు ఆర్థిక పరమైన అవకతవకను ముందుగానే గుర్తించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు పొరుగు దేశాలైన భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక కస్టమ్స్ విభాగాల అధిపతులు కూడా హజరయ్యారు.