
1.6 కోట్ల ఖాతాదారులు లక్ష్యం
ముంబై: పెద్ద ఎత్తున నిధుల సమీకరణ యత్నాల్లో ఉన్న కోటక్ మహింద్రా బ్యాంకు ఏ బ్యాంకును కొనుగోలు చేయనుందా...? అని ఆసక్తిగా ఎదురు చూసిన పరిశీలకులు, ఇన్వెస్టర్లకు... బుధవారం నాటి మీడియా సమావేశం సందర్భంగా ఆశ్చర్యానికి గురి చేస్తూ రిటైల్ కార్యకలాపాలను భారీగా విస్తరించనున్నట్టు బ్యాంకు నుంచి ప్రకటన వెలువడింది. ఇందుకోసం ‘811’ అనే డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌ను కోటక్ బ్యాంకు తీసుకొచ్చింది.
ప్రస్తుతం 80 లక్షల ఖాతాదారులు ఉండగా వచ్చే 18 నెలల్లో వీరి సంఖ్యను 1.6 కోట్లకు పెంచుకోవాలన్న లక్ష్యాన్ని విధించుకున్నట్టు బ్యాంకు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఉదయ్ కోటక్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆధార్ ఆధారిత ఓటీపీ ధ్రువీకరణ తీసుకొస్తున్న తొలి బ్యాంకు తమదేనన్నారు. ఎన్‌బీఎఫ్‌సీ సంస్థను కొనుగోలు చేస్తుందంటూ వచ్చిన వార్తలు వదంతులుగానే పేర్కొన్నారు. దేశీయ బ్యాంకులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న మొండి బకాయిల ఒత్తిళ్ల నుంచి బయటకు రావడానికి కనీసం 100 బిలియన్ డాలర్ల తాజా మూలధనం అవసరమని చెప్పారు. మొండి బకాయిలు రూ.14 లక్షల కోట్లను దాటి మొత్తం వ్యవస్థలో 9.3%కి చేరాయన్నారు.
ఐదు నిమిషాల్లో ఖాతా: 811 అనే మొబైల్ యాప్ ద్వారా జీరో బ్యాలన్స్ ఖాతాను ప్రారంభించవచ్చని ఉదయ్ కోటక్ వెల్లడించారు. నగదు నిల్వలపై 6 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నట్టు చెప్పారు. కొత్తగా 80 లక్షల మంది ఖాతాదారుల్లో సగం మేర ఈ ప్లాట్ ఫామ్ ద్వారా రావచ్చని ఉదయ్‌కోటక్ చెప్పారు. జీరో బ్యాలన్స్ ఖాతాలపై ఏ విధమైన చార్జీలూ విధించే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
ఒకవైపు ప్రభుత్వరంగ ఎస్‌బీఐ సేవింగ్స్ ఖాతాలపై నగదు నిల్వలు పెంచుతూ నిర్ణయం తీసుకుంటే... తాము జీరో బ్యాలన్స్‌కే ఖాతాను అందించడం సాహసోపేత నిర్ణయంగా అభివర్ణించారు. 811 అన్నది వ్యాలెట్ కాదని, పూర్తి స్థాయి బ్యాంకు ఖాతాయేనన్నారు. భౌతికంగా డెబిట్ కార్డు కావాలంటే కనీస చార్జీ చెల్లించాల్సి ఉంటున్నారు. 811 ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకే అందుబాటులో ఉండగా, త్వరలో యాపిల్ స్టోర్‌లోనూ అందుబాటులోకి రానుంది.