ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) నికర లాభం 37 శాతం ఎగిసి రూ. 1,490 కోట్ల నుంచి రూ. 2,042 కోట్లకు చేరింది. అటు ఆదాయం 24 శాతం వృద్ధితో రూ. 28,747 కోట్ల నుంచి రూ. 35,709 కోట్లకు పెరిగింది. సమీక్షాకాలంలో కొత్తగా రూ. 42,233 కోట్ల ఆర్డర్లు దక్కించుకున్నట్లు సంస్థ సీఎఫ్‌వో ఆర్ శంకర రామన్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో వచ్చిన కొత్త ఆర్డర్లు రూ. 48,130 కోట్లని పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో కొత్త ఆర్డర్ల రాక 12 శాతం తగ్గినప్పటికీ.. తొమ్మిది నెలల వ్యవధిలో చూస్తే 16 శాతం వృద్ధి ఉందని ఆయన వివరించారు.
అంతర్జాతీయంగా ఒడిదుడుకుల పరిస్థితులు ఉన్నప్పటికీ.. ఆర్డర్ల సంఖ్య 30 శాతం మేర పెరిగిందన్నారు. డిసెంబర్ 31 నాటికి మొత్తం రూ. 2,84,049 కోట్ల ఆర్డర్లు చేతిలో ఉన్నాయని చెప్పారు. మరోవైపు, ప్రతిపాదిత రూ. 9,000 కోట్ల షేర్ల బైబ్యాక్ ఆఫర్‌ను సెబీ తిరస్కరించడంపై స్పందించిన సీఈవో ఎస్‌ఎన్ సుబ్రమణ్యన్.. ఈ విషయంపై సెబీతో చర్చించనున్నట్లు తెలిపారు. వాటాదారులకు అధిక ప్రయోజనం చేకూర్చడమే తమ ఉద్దేశమన్నారు. బీఎస్‌ఈలో సంస్థ షేరు 0.85 శాతం క్షీణించి రూ. 1,285.55 వద్ద క్లోజయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment