
చిన్న వర్తకులకు ‘పన్ను’ నజరానా!
డిజిటల్ లావాదేవీలకు మారితే 6 శాతమే ఆదాయపన్ను: సీబీడీటీ
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహక చర్యల్లో భాగంగా చిన్న వర్తకులకు కేంద్ర ప్రభుత్వం ఓ సదవకాశం కల్పించింది. రూ.2 కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన వ్యాపారులు డిజిటల్ రూపంలో చెల్లింపులు స్వీకరిస్తే...ఆదాయపన్ను తక్కువ చెల్లించే అవకాశాన్ని కల్పించింది. ఆదాయపన్ను చట్టం–1961 లోని సెక్షన్ 44ఏడీ ప్రకారం వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబం తదితర వర్గాల వారు వార్షిక వ్యాపారం రూ.2 కోట్లు, అంతకంటేతక్కువగా ఉంటే... ఆ మొత్తం టర్నోవర్‌లో లాభాన్ని 8 శాతంగా పరిగణించి పన్ను చెల్లించే అవకాశం ఉంది.
అయితే, ఈ టర్నోవర్‌కు సరిపడా చెల్లింపులను బ్యాకింగ్ చానల్, డిజిటల్ విధానంలో స్వీకరించి ఉంటే ఈపన్ను రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6 శాతానికి తగ్గించాలని నిర్ణయించినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. ఒకవేళ నగదు రూపంలోనే స్వీకరించి ఉంటే 8 శాతం పన్ను రేటేఅమలవుతుందని స్పష్టం చేసింది. తక్కువ నగదు చలామణి గల వ్యవస్థగా మారాలన్న ప్రభుత్వ లక్ష్యం సాకారం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.