
‘‘ఒకానొక సమయంలో నాకు వ్యాధి తిరగబెట్టింది. పెళ్లైన నెల తర్వాత ఇలా జరిగింది. అది చాలా కఠిన సమయం. అయితే ఈ రహస్యాన్ని నా భర్త దగ్గర దాచిపెట్టాను. పెళ్లి జరిగిన తర్వాత అన్నీ సర్దుకుంటాయని భావించాను. వైవాహిక జీవితం సాఫీగా సాగిపోవాలనే ఇలా చేశాను. దాని కారణంగా నేను ఒక్కదాన్నే క్యాన్సర్‌తో పోరాడాల్సి వచ్చింది. నిజాయితీగా చెప్పాలంటే నా జీవితంలో అత్యంత బాధ పడిన సమయం అదే’’ అంటూ మోడల్, నటి లీసా రే తన జీవితంలోని సంఘటనల గురించి పంచుకున్నారు. అర్థం చేసుకునే భర్త దొరికిన కారణంగా పెద్దగా సమస్యలేవీ ఎదురుకాలేదని కరీనా కపూర్ టాక్ షోలో చెప్పుకొచ్చారు. మోడలింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లీసారే క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. క్రమంగా వ్యాధి నుంచి కోలుకున్న ఆమె... 2012లో తన ప్రియుడు జాసన్ డేహ్నిని పెళ్లాడారు.
తాజాగా ఈ విషయాల గురించి కరీనాతో మాట్లాడిన లీసా రే.. ప్రాణాంతక వ్యాధి బారిన పడిన మహిళను స్వీకరించే భర్త లభించడం తన అదృష్టమన్నారు. ‘‘ నాకు అందమైన మనస్సున్న భర్త దొరికాడు. నన్ను పెళ్లి చేసుకుంటున్నందుకు థాంక్స్ బేబీ అని తనకు చెప్పాను. ఒకవేళ వ్యాధి మళ్లీ తిరగబెడితే చికిత్స కోసం వెళ్లాల్సి ఉంటుందని కూడా చెప్పాను. నేను ఊహించినట్లుగానే జరిగింది. అయితే తనతో ప్రయాణం నాలో మార్సులు తీసుకువచ్చింది. కేవలం 3 నెలల వ్యవధిలోనే కోలుకున్నాను’’ అని భర్తపై ప్రేమను చాటుకున్నారు. కాగా లీసా రే- జాసన్ డేహ్ని జంట సరోగసీ విధానంలో 2018లో కవల ఆడపిల్లలకు జన్మనిచ్చారు. ఇక తాను క్యాన్సర్‌ను జయించిన క్రమంలో ఎదురైన మానసిక సంఘర్షణ గురించి ‘క్లోజ్ టూ ది బోన్’ పేరిట లీసా రే పుస్తకరూపంలో తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment