
కేంద్రం, రాష్ట్రాల అప్పులు తగ్గాలి
• ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సూచన
• బ్యాంకింగ్ రంగానికి తగినంత నిధుల సాయం అవసరం
• సబ్సిడీలు తగ్గించుకోవాలని హితవు
గాంధీనగర్: కేంద్ర బడ్జెట్‌కు ముందు ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రభుత్వానికి కీలకమైన సూచనలు చేశారు. అధిక స్థాయిలో ఉన్న కేంద్ర, రాష్ట్రాల రుణ భారాన్ని తగ్గించుకునే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. స్థిరమైన స్థూల ఆర్థిక రంగ పరిస్థితుల కోసం దేశానికి చక్కని విధానం అవసరమని చెప్పారు. వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో ఆయన మాట్లాడారు. మధ్య కాలానికి ద్రవ్యోల్బణం 4 శాతం అన్నది సురక్షితమైన, స్థిరమైనదిగా పేర్కొన్నారు. ప్రభుత్వం బ్యాంకింగ్ రంగానికి తగినంత నిధులు అందించాలని ఆశిస్తున్నట్టు ఉర్జిత్ పటేల్ చెప్పారు. గత కొన్ని సంవత్సరాల్లో నిర్మించుకున్న స్థూల ఆర్థిక వాతావరణం విచ్ఛిన్నం కానీయరాదన్నారు.
దేశ రుణ–జీడీపీ నిష్పత్తి సార్వభౌమ రేటింగ్‌పై ప్రభావం చూపుతోందన్నారు. కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి ద్రవ్యలోటు జీ20 గ్రూపు దేశాల్లోనే అధిక స్థాయిలో ఉందని ఉర్జిత్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని మనం అభివృద్ధి దిశగా ముందుకు సాగిపోవాలి. ప్రత్యేకంగా ఇది సవాళ్లను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు, ఆర్థిక అస్థిరతను తగ్గించేందుకు సాయపడుతుంది’’ అని ఉర్జిత్ పటేల్ వివరించారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక బడ్జెట్ పార్లమెంట్ ముందుకు రానున్న నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ సూచనలకు ప్రాధాన్యం ఏర్పడింది. 2016–17 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి ద్రవ్యలోటు లక్ష్యం 6.4 శాతంగా ఉంది.
హామీలు, రాయితీల విషయంలో జాగ్రత్త...
‘‘రుణాల సబ్సిడీ లేదా రుణ హామీల విషయంలో ప్రభుత్వం జాగరూకతతో ఉండాలి. ఎందుకంటే ఈ విధమైన పథకాలు ప్రభుత్వ రుణ భారాన్ని పెంచుతాయి. కొన్ని రకాల హామీలు, పరిమిత రాయితీలు మేలు చేస్తాయి కానీ, వడ్డీ రేట్లలో గణనీయమైన రాయితీలు, భారీ స్థాయి రుణ హామీలు సరైన ఆర్థిక వనరుల కేటాయింపులకు అడ్డుగా మారతాయి. రుణ హామీలు ప్రభుత్వ కంటింజెంట్ లయబిలిటీలను పెంచుతాయి. దీంతో సొంతంగా రుణ సేకరణ రిస్క్ కూడా పెరిగిపోతుంది. జాగ్రత్తతో కూడిన ద్రవ్య నిర్వహణ అనేది స్థూల ఆర్థిక స్థిరత్వానికి కీలకం. 2013 నుంచి కేంద్ర ప్రభుత్వం ద్రవ్య స్థిరీకరణ దిశగా ప్రగతిని సాధించింది. అయినప్పటికీ సాధారణ ద్రవ్యలోటు (కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి) పరంగా చూస్తే ఐఎంఎఫ్ గణాంకాల ప్రకారం జీ20 దేశాల్లో అధిక స్థాయిలో ఉంది’’ అని ఉర్జిత్ పేర్కొన్నారు. పేదలు, రైతులు, మహిళలు, చిన్న వ్యాపారులకు తక్కువ వడ్డీకే రుణాలు అందించేందుకు ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించిన పథకాన్ని నేరుగా పేర్కొనకుండా ఉర్జిత్ ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం.
వృద్ధికి ద్రవ్యోల్బణ స్థిరత్వం అవసరం
‘‘చక్కని వృద్ధికి వీలుగా పెట్టుబడులను ఇతోధికం చేసేందుకు అర్థవంతమైన వడ్డీ రేట్లు ఉండాలి. అందుకు వినియోగ ఆధారిత ద్రవ్యోల్బణాన్ని తక్కువ స్థాయిలో, స్థిరంగా ఉంచడం అన్నది కనీస అవసరం’ అని ఉర్జిత్ పేర్కొన్నారు.
ఉర్జిత్ మరోసారి అలానే...
ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మరోసారి మీడియా ఫోబియా చాటుకున్నారు. బుధవారం వైబ్రెంట్ గుజరాత్ సదస్సుకు వచ్చిన ఆయన్ను పెద్ద నోట్ల రద్దుపై ప్రశ్నించేందుకు మహాత్మా మందిర్ వెలుపల టీవీ, పత్రికల ప్రతినిధులు భారీ సంఖ్యలో కాచుక్కూర్చున్నారు. ఈ విషయం గ్రహించిన ఆయన ఓ నోట్‌ను సహాయకులతో మీడియాకు అందించి వెనుక డోర్ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. ఆయన్ను చేరుకునేందుకు మీడియా ప్రతినిధులు పరుగు తీసినా ప్రయోజనం లేకపోయింది. ఉర్జిత్ చాలా వేగంగా నడుచుకుంటూ వెళ్లి కారెక్కి అక్కడి నుంచి చలోమన్నారు.