సెల్ఫ్‌డ్రైవ్‌కు లగ్జరీ కార్లు | luxury cars to Self-drive | Sakshi
Sakshi News home page

సెల్ఫ్‌డ్రైవ్‌కు లగ్జరీ కార్లు

Published Wed, Jun 25 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 9:20 AM

సెల్ఫ్‌డ్రైవ్‌కు లగ్జరీ కార్లు

సెల్ఫ్‌డ్రైవ్‌కు లగ్జరీ కార్లు

సెల్ఫ్ డ్రైవ్‌కు అద్దె కారు. ఇదంతా పాత ట్రెండ్.

హైదరాబాద్‌తోసహా 5 నగరాల్లో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెల్ఫ్ డ్రైవ్‌కు అద్దె కారు. ఇదంతా పాత ట్రెండ్. మరి సెల్ఫ్ డ్రైవ్‌కు లగ్జరీ కారు దొరికితే.. హాయిగా కుటుంబ సభ్యులతో, మనసుకు నచ్చిన వారితో షికారు చేయమూ.. అది కూడా గంటకు రూ.900, రోజుకు రూ.6,500 ఖర్చుతో!  కార్జ్ ఆన్ రెంట్ భారత్‌లో తొలిసారిగా మైల్స్ పేరుతో మెర్సిడెస్ బెంజ్‌తో కలిసి సెల్ఫ్‌డ్రైవ్‌కు (సొంతంగా డ్రైవింగ్) లగ్జరీ కార్లను ప్రవేశపెట్టింది.
 
ప్రస్తుతం మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్, ఇ-క్లాస్ కార్లు అందుబాటులో ఉంటాయి. రానున్న రోజుల్లో ఎస్‌ఎల్‌కే, ఏఎంజీ మోడళ్లతోపాటు ఇతర బ్రాండ్లను కూడా పరిచయం చేయనున్నట్టు కార్జ్ ఆన్ రెంట్ తెలిపింది. ప్రస్తుతానికి ఈ సేవలు హైదరాబాద్‌తోసహా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలో అందుబాటులోకి తెచ్చారు.
 
100 శాతం వృద్ధి..
మంచి రోడ్లు, నావిగేషన్ సౌకర్యాలు అందుబాటులోకి రావడంతోపాటు డ్రైవర్ల సేవలు ఖరీదు అవడంతో అద్దె కార్లను సొంతంగా నడిపేందుకే కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. లగ్జరీ కార్ల విషయంలో అయితే స్టేటస్ సింబల్ ప్రధాన భూమిక పోషిస్తోందని కార్జ్ ఆన్ రెంట్ చెబుతోంది.
 
సెల్ఫ్ డ్రైవ్ విభాగంలో తమ కంపెనీ గతేడాది 100 శాతం వృద్ధి నమోదు చేసిందని సంస్థ ఎండీ, సీఈవో రాజీవ్ విజ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. దేశవ్యాప్తంగా తమ సంస్థకు 30 వేల మంది సెల్ఫ్ డ్రైవ్ కస్టమర్లుంటే, హైదరాబాద్, వైజాగ్‌లో 3 వేల మంది ఉన్నారని చెప్పారు. మైల్స్ పేరుతో ఈ విభాగాన్ని 2013 నవంబరులో ప్రారంభించామని, ప్రస్తుతం 16 నగరాల్లో సేవలందిస్తున్నట్టు చెప్పారు. మూడేళ్లలో 39 నగరాలకు విస్తరిస్తామని పేర్కొన్నారు. లగ్జరీ కార్లను నడిపేందుకు కస్టమర్లు ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు.
 
మూడేళ్లలో 5,000 కార్లు..
మైల్స్ విభాగంలో ప్రస్తుతం కంపెనీ వద్ద 260 కార్లున్నాయి. ఇందులో మెర్సిడెస్ కార్లు 11 ఉన్నాయి. ఏడాదిలో 1,000 కార్లు కొనుగోలు చేయనున్నట్టు రాజీవ్ తెలిపారు. ఇందుకోసం రూ.100 కోట్లు వెచ్చిస్తామని పేర్కొన్నారు. మూడేళ్లలో మైల్స్ విభాగంలో 5,000 కార్లను చేర్చాలన్నది లక్ష్యమని వివరించారు.
 
మూడు ప్రైవేటు ఈక్విటీ సంస్థల నుంచి ఇప్పటికే నిధులు స్వీకరించామని చెప్పారు. లాభాలు గడిస్తున్నామని, అవసరమైతే మరిన్ని నిధులు ఇచ్చేందుకు ఈ సంస్థలు సిద్ధమని పేర్కొన్నారు. కార్జ్ ఆన్ రెంట్, ఈజీ క్యాబ్స్, మైల్స్ బ్రాండ్లలో కంపెనీ సొంతంగా కొనుగోలు చేసిన 7,500 వాహనాలున్నాయి. క్యాబ్ పరిశ్రమ భారత్‌లో 14 శాతం వృద్ధితో రూ.25,000 కోట్లుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement