వాయిదా పద్ధతుంది వైద్యానికైనా...!
ఇల్లు, కారు, టీవీ మొదలైన వాటిని నెలవారీ వాయిదా(ఈఎంఐ)ల్లో కొనడం మధ్యతరగతి వారికి అలవాటే. ఈ సౌకర్యం ఇపుడు ఆరోగ్య సంరక్షణ రంగానికి సైతం వ్యాపిస్తోంది. అంటే, ఖరీదైన ఔషధాలు, వైద్య పరికరాలను వాయిదాల పద్ధతిలో కొనుక్కోవచ్చు. వాస్తవానికి ఈ సౌలభ్యం రోగుల కంటే ఫార్మా కంపెనీలకు, వైద్య పరికరాల ఉత్పత్తిదారులకు ఎక్కువ మేలు చేయనుంది. ఖరీదైన మందులు, పరికరాలను వారు సులువుగా విక్రయించగలుగుతారు.
ప్రాజెక్ట్ సంభవ్...
గుండె కవాటాలు (వాల్వులు), స్టెంట్ల వంటి ఖరీదైన పరికరాలను స్వల్పకాలిక రుణంతో, వాయిదా పద్ధతిలో వినియోగదారులకు అందించేందుకు ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు ఆర్థిక సంస్థలతో చేతులు కలుపుతున్నాయి. హెపటైటిస్-సి చికిత్సకు ఉపయోగించే ఇంటర్‌ఫెరాన్ అనే ఖరీదైన ఔషధాన్ని రోగులకు రుణంపై ఇచ్చేందుకు ఎంఎస్‌డీ (మెర్క్ షార్ప్ అండ్ డోమ్) కంపెనీ పంజాబ్‌లో ఓ ఫైనాన్స్ కంపెనీతో చేతులు కలిపింది.
హెపటైటిస్-సి బాధితులు ఈ కంపెనీ రుణ సహాయంతో చికిత్స చేయించుకుని ఆ మొత్తాన్ని వాయిదాల్లో చెల్లించవచ్చు. ‘హెపటైటిస్ గురించి ప్రజల్లో చైతన్యం పెంచడానికి, చికిత్స పొందడంలో అవరోధాలను తొలగించడానికి పంజాబ్‌లో ప్రాజెక్ట్ సంభవ్‌ను ప్రారంభించాం. బ్యాంకు ఖాతాల్లేని మారుమూల గ్రామీణ ప్రజలకు సైతం సేవలు అందిస్తున్నాం...’ అని ఎంఎస్‌డీ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ కంపెనీ మున్ముందు మరిన్ని ఉత్పత్తులకు కూడా ఫైనాన్స్ సౌకర్యం కల్పించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
పరికరం విలువలో 85 శాతం రుణం...
దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ఉపయోగించే పరికరాల ఉత్పత్తిలో పేరొందిన మెడ్‌ట్రానిక్ కంపెనీ కొంతకాలం క్రితం మైత్రిక ఫౌండేషన్‌తో జోడీకలిసింది. ‘హెల్దీ హార్ట్ ఫర్ ఆల్’ పేరుతో మెడ్‌ట్రానిక్ చేపట్టిన కార్యక్రమం ద్వారా హృద్రోగులకు స్టెంట్లు, ఇంప్లాంటబుల్ పేస్‌మేకర్లు, క్యాథోడ్ రే ట్యూబులు, వాల్వులను ఈఎంఐల ద్వారా అందచేస్తోంది. పరికరం విలువలో 85 శాతం వరకు రుణ సౌకర్యం కల్పిస్తున్నామని కంపెనీ ప్రతినిధి వివరించారు.
ఆరు నెలల్లో చెల్లించే ఇలాంటి రుణాలపై వడ్డీ లేదని చెప్పారు. నెలవారీ వాయిదాల్లో ఐదేళ్లపాటు చెల్లించే సౌకర్యం కూడా ఉందని తెలిపారు. హెల్దీ హార్ట్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని ముందుగా దుర్గాపూర్ (పశ్చిమ బెంగాల్), అహ్మద్‌నగర్ (గుజరాత్)లలో 2010లో ప్రారంభించారు. ప్రస్తుతం 30 నగరాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించారు. ఇప్పటివరకు 430 మందికి రుణ సౌకర్యం కల్పించామనీ, రూ.30 వేల నుంచి రూ.8.50 లక్షల విలువైన పరికరాలను సమకూర్చామనీ కంపెనీ తెలిపింది.
అదే బాటలో ఎంఎన్‌సీలు...
ప్రసిద్ధిచెందిన పలు బహుళ జాతి ఫార్మా కంపెనీలు సైతం ఈఎంఐ పద్ధతిలో తమ వ్యాపారాన్ని పెంచుకునే యోచనలో ఉన్నాయి. ఇళ్లు, కార్లు, సెల్‌ఫోన్లను వాయిదాల పద్ధతిలో ఇస్తున్నపుడు స్టెంట్లు, ఔషధాలను ఇస్తే తప్పేముందని ఓ ఫైనాన్స్ కంపెనీ సీనియర్ అధికారి ప్రశ్నించారు. సులభంగా లభించే ఇలాంటి రుణాలు దుర్వినియోగమయ్యే అవకాశం ఉందనీ, దీన్ని నివారించడానికి తగిన ప్రణాళికలు ఉండాలనీ ఈ రంగానికి చెందిన నిపుణుడొకరు సలహాఇచ్చారు.
అయితే ఈ కార్యకలాపాలను కంపెనీలు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నాయని ఎంఎస్‌డీ ప్రతినిధి స్పష్టంచేశారు. ‘డాక్టర్లు, ఫైనాన్స్ కంపెనీల ద్వారా రోగులకు పూర్తి సమాచారం అందిస్తున్నాం. తద్వారా వారికి సంపూర్ణ అవగాహన ఏర్పడి తగిన నిర్ణయం తీసుకుంటున్నారు. ఔషధాలకు, పరికరాలకు రుణ సౌకర్యం ఒక ఆప్షన్ మాత్రమే. చికిత్సకు డబ్బుల్లేక ఇబ్బందిపడుతూ, వాయిదాల పద్ధతిలో చెల్లించగలిగిన వారికి స్వల్పకాలిక రుణ సౌకర్యం కల్పిస్తున్నాం...’ అని ఆ ప్రతినిధి వివరించారు.