దీర్ఘకాలంలో మార్కెట్లకు లాభాలు
ముంబై: కేంద్రం చేపట్టబోయే మరిన్ని సంస్కరణలు దీర్ఘకాలంలో మార్కెట్లకు ఊతంగా నిలుస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్నెల్ల నుంచి ఏడాది వ్యవధిలోగా భారత్ మళ్లీ అధిక వృద్ధి బాట పట్టగలదని చెబుతున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మరిన్ని సంస్కరణలు ప్రకటి ంచవచ్చన్న వార్తలతో మార్కెట్లు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో విశ్లేషకుల అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
సానుకూల సెంటిమెంటు మూలంగా విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరపడంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఆగస్టు 14తో ముగిసిన వారంలో ... అంత క్రితం వారం కన్నా దూకుడుగా మూడు శాతం పైగా పెరిగాయి. సంస్కరణలపై ఆశాభావం, అంతర్జాతీయంగా భౌగోళిక-రాజకీయపరమైన విషయాలపై ఆందోళనలు తగ్గుముఖం పట్టడం తదితర అంశాలు సైతం ఈ పరుగుకు తోడ్పడ్డాయని కోటక్ సెక్యూరిటీస్ హెడ్ (ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్) దీపేన్ షా పేర్కొన్నారు.
మరోవైపు, ‘మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా ప్రభుత్వం చేపట్టబోయే అదనపు సంస్కరణలు మార్కెట్లకు ఊతం ఇవ్వగలవని భావిస్తున్నాం. అంతర్జాతీయంగా భౌగోళిక-రాజకీయ అంశాలు, రుతుపవనాల కదలికలు సమీప కాలంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది’ అని చెప్పారు.
సంస్కరణలు అమలవ్వాలి ..
కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకుండా సంస్కరణలు క్షేత్రస్థాయిలో అమలు కావాల్సిన అవసరం ఉంటుందని రీసెర్చ్ సంస్థ జైఫిన్ అడ్వైజర్స్ సీఈవో దేవేంద్ర నెవ్‌గీ అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలికంగా మార్కెట్లు సంతృప్తికరమైన దిశలోనే కదులుతున్నట్లు భావిస్తున్నామన్నారు. స్వల్పకాలికంగా కాస్త ఒడిదుడుకులు ఉన్నా.. స్థూల ఆర్థిక పరిస్థితుల సంకేతాలు చూస్తుంటే దీర్ఘకాలికంగా సానుకూల ఫలితాలే ఉండేట్లు కనిపిస్తోందని దేవేంద్ర చెప్పారు. వచ్చే ఆరు నెలలు-ఏడాది కాలంలో భారత్ మళ్లీ అధిక వృద్ధి రేటు సాధించే అవకాశాలు ఇందుకు తోడ్పడగలవని ఆయన పేర్కొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం మార్కెట్లకు సెలవు దినం కాగా.. అంతకు ముందు రోజున విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) గణనీయంగా కొనుగోళ్లు జరిపిన సంగతి తెలిసిందే. గురువారం రోజున ఎఫ్‌ఐఐలు నికరంగా రూ. 1,266.54 కోట్ల మేర కొనుగోళ్లు జరిపారు. ఇటు బ్యాంకులు, డెవలప్‌మెంట్ ఫైనాన్స్ సంస్థలు, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్ సహా దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) సైతం రూ. 135.75 కోట్ల పైచిలుకు స్టాక్స్ కొన్నారు. ఫలితంగా సెన్సెక్స్ 26,103 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది.