మార్కెట్ పై ఫలితాల ఎఫెక్ట్
విదేశీ నిధుల ప్రవాహం
దేశీ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) నిధుల ప్రవాహం జోరుగానే కొనసాగుతోంది. ఏప్రిల్ నెలలో ఇప్పటిదాకా నికరంగా రూ.6,783 కోట్ల విలువైన షేర్లను ఎఫ్‌ఐఐలు కొనుగోలు చేయడమే దీనికి నిదర్శనం. ప్రధానంగా రానున్న కేంద్ర ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని, సంస్కరణలకు పెద్దపీటవేస్తుందన్న విశ్వాసమే విదేశీ నిధుల ప్రవాహానికి కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. కాగా, జనవరి నుంచి ఇప్పటిదాకా ఎఫ్‌ఐఐలు దేశీ స్టాక్స్‌లో నికరంగా రూ.28,979 కోట్ల పెట్టుబడులు పెట్టారు. కాగా, ఏప్రిల్‌లో డెట్ మార్కెట్ నుంచి రూ.4,282 కోట్లను నికరంగా ఉపసంహరించుకున్నారు.
న్యూఢిల్లీ: గత వారంలో ప్రారంభమైన కార్పొరేట్ కంపెనీల మార్చి క్వార్టర్(క్యూ4) ఫలితాలు స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్ధేశించనున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా ఈ వారంలో వెలువడనున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర బ్లూచిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు మార్కెట్ ట్రెండ్‌కు దిక్సూచిగా పనిచేస్తాయని వారు పేర్కొన్నారు.
బుధవారం నాడు ఏప్రిల్ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల(ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) ముగింపు నేపథ్యంలో సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులను చవిచూడొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా, గురువారం(24న) ముంబైలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. మరోపక్క, గత శుక్రవారం వెలువడిన దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) ఆర్థిక ఫలితాలు కూడా స్వల్పకాలానికి మార్కెట్‌పై ప్రభావం చూపనున్నట్లు నిపుణులు వ్యాఖ్యానించారు.
కొనసాగనున్న ఎన్నికల ట్రిగ్గర్...
ఈ నెల 7న ప్రారంభమైన లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ స్టాక్ మార్కెట్లకు అతిపెద్ద ట్రిగ్గర్‌గా కొనసాగనుందని రెలిగేర్ క్యాపిటల్ మార్కెట్స్ డెరైక్టర్(ఇనిస్టిట్యూషనల్ రీసెర్చ్) తీర్థంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. ‘ప్రస్తుత స్టాక్ మార్కెట్ ర్యాలీకి ప్రధానంగా కేంద్రంలో రానున్నది బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వమేనన్న బలమైన అంచనాలే కారణం. అదేవిధంగా దేశ స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగవడం, డాలరుతో రూపాయి మారకం విలువ పుంజుకోవడం వంటి అంశాలు కూడా మార్కెట్ దూకుడుకు దోహదం చేస్తున్నాయి. ఎలక్షన్ ఆధారిత ర్యాలీని పక్కనబెడితే... తాజాగా మొదలైన కార్పొరేట్ల త్రైమాసిక పనితీరు(క్యూ4 ఫలితాలు) కూడా రానున్న కొద్దివారాల్లో మార్కెట్ గమనాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించనుంది’ అని పట్నాయక్ చెప్పారు.
నిఫ్టీ 6,800 స్థాయిపైన మరింత జోరు...
సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఆశావహ ధోరణి(సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు అంచనాలు)ని స్టాక్ మార్కెట్లు ప్రదర్శిస్తున్నాయని, తదుపరి దిశానిర్దేశం క్యూ4 ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలదేనని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేశ్ గోయల్ తెలిపారు. మార్కెట్లో కరెక్షన్ వచ్చినప్పుల్లా కొనుగోళ్ల మద్దతు కొనసాగుతుందన్నారు. అదేవిధంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 6,800 పాయింట్లపైన మరింత ర్యాలీకి అవకాశం ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో బులిష్ ట్రెండ్‌కు ప్రతిబింభంగా తగిన సాంకేతిక సూచికలు కనబడుతున్నాయని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ చౌదరి పేర్కొన్నారు. నిఫ్టీ 6700-6,800 స్థాయిలో, సెన్సెక్స్ 22,600-23,800 స్థాయిలో కదలాడవచ్చనేది ఆయన అంచనా.
ఎఫ్‌ఐఐ, రూపాయిపై దృష్టి...
స్టాక్ మార్కెట్లకు దిశానిర్దేశాన్ని కొనసాగించే అంశాల్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ) పెట్టుబడులు, డాల రుతో రూపాయి మారకం విలువ కదలికలు, ప్రపంచ మార్కెట్ల గమనం, సంబంధిత పరిణామాలు ప్రధానంగా ఉంటాయని చౌదరి చెప్పారు. అమెరికాలో ఇళ్ల అమ్మకాలు, ఇతరత్రా కొన్ని కీలక గణాంకాలు ఈ వారంలోనే వెలువడనున్నాయని... మార్కెట్ వర్గాలు వీటిపైనా దృష్టిసారించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గడిచిన వారంలో(సెలవుల కారణంగా మూడు ట్రేడింగ్ రోజులే) ద్రవ్యోల్బణం, ఐఐపీ గణాంకాలు, కార్పొరేట్ ఫలితాల ప్రభావంతో దేశీ మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లను చవిచూశాయి. గురువారం సెన్సెక్స్ 352 పాయింట్లు(22,629), నిఫ్టీ 104 పాయింట్లు(6,779) చొప్పున ఎగబాకాయి.