సూచీలకు స్వల్ప నష్టాలు
* వడ్డీ రేట్ల ప్రభావిత షేర్లపై ఒత్తిడి
* ఐటీ షేర్లలో కొనుగోళ్లు
మార్కెట్ అప్‌డేట్
ఆర్‌బీఐ పరపతి విధానం వెలువడనున్న నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్లు ఆచి తూచి స్పందించాయి.ఇటీవల బాగా పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ, కొన్ని బ్లూ చిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరాశపరచడం, అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉండడం వంటి కారణాలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపాయి.
ఇంట్రాడేలో 200 పాయింట్లవరకూ నష్టపోయిన సెన్సెక్స్ చివరి గంటలో రేట్ల కోత ఆశలతో కొద్దిగా కోలుకుంది. మొత్తం మీద బీఎస్‌ఈ సెన్సెక్స్ 61 పాయింట్లు నష్టపోయి 29,122 పాయింట్ల వద్ద, నిఫ్టీ 12 పాయింట్లు నష్టపోయి 8,797 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ఒక వారం కనిష్టానికి ముగిసింది. ఆర్‌బీఐ పరపతి విధానం నేపధ్యంలో వడీరేట్ల ప్రభావిత షేర్లపై ఒత్తిడి కనిపించిందని విశ్లేషకులంటున్నారు.
ఈ షేర్లు మిశ్రమంగా ముగిశాయి. ఐటీ షేర్లకు కొనుగోలు మద్దతు లభించింది. జనవరి నెల హెచ్‌ఎస్‌బీసీ తయారీ గణాంకాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయని వెల్త్‌రేస్ సెక్యూరీటీస్ సీఈఓ కిరణ్ కుమార్ కవికొండల వ్యాఖ్యానించారు. చైనా తయారీ రంగ గణాంకాలు కూడా నిరాశమయంగా ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
రికార్డ్ స్థాయికి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్
ఈ ఏడాది జనవరి అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ డీలా పడ్డాయి. ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఇంట్రాడేలో రికార్డ్ స్థాయికి(రూ.1,900)కు చేరి, చివరకు 5.5 శాతం లాభంతో రూ.1,891 వద్ద ముగిసింది. సిటీ సంస్థ టార్గెట్ ధరను రూ.2,175కు పెంచడంతో కొనుగోళ్లు జోరుగా పెరిగాయి. 30 షేర్ల సెన్సెక్స్‌లో 17 షేర్లు నష్టపోగా, 13 లాభపడ్డాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో 1,672 షేర్లు లాభపడగా, 1,288 షేర్లు తగ్గాయి.