స్వల్ప లాభాలతో సరి
- గ్రీసు సంక్షోభం కారణంగా చివర్లో అమ్మకాలు
- 230 పాయింట్ల నుంచి 41 పాయింట్ల లాభానికి దిగిన సెన్సెక్స్
- మార్కెట్ అప్‌డేట్
స్టాక్ మార్కెట్ సోమవారం స్వల్ప లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 41 పాయింట్లు, నిఫ్టీ 4 పాయింట్ల లాభాలతో గట్టెక్కాయి. ఒక దశలో 230 పాయింట్ల వరకూ ఎగసిన సెన్సెక్స్ చివరి అరగంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో 41 పాయింట్ల లాభంతోనే సరిపుచ్చుకోవలసి వచ్చింది. గ్రీస్ రుణ సంక్షోభ సంప్రదింపుల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫార్మా, ఆయిల్, గ్యాస్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. కాగా స్టాక్ మార్కెట్ లాభపడడం ఇది వరుసగా ఐదో రోజు.
బడ్జెట్‌పైనే దృష్టి
టోకు ధరల సూచీ జనవరిలో ప్రతికూలంగా నమోదు కావడంతో వడ్డీరేట్లు తగ్గుతాయని, వృద్ధికి ఊతమిచ్చే బడ్జెట్ రానున్నదనే అంచనాలు ఒకదశలో స్టాక్ సూచీలు పెరగడానికి దోహదపడ్డాయి. సెన్సెక్స్ 29,171 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. క్రమేపీ 29,325 పాయింట్లకు ఎగసింది. చివరకు 41 పాయింట్ల లాభంతో 29,136 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది సెన్సెక్స్‌కు రెండు వారాల గరిష్ట స్థాయి. గత ఐదు ట్రేడింగ్ సెషన్‌లలో సెన్సెక్స్ 908 పాయింట్లు లాభపడింది. డిసెంబర్ క్వార్టర్ ఆర్ధిక ఫలితాలు దాదాపు ముగియడంతో ఇక అందరి దృష్టి బడ్జెట్‌పైననే ఉందని నిపుణులంటున్నారు.
30 షేర్ల సెన్సెక్స్‌లో 16 షేర్లు లాభాల బాట పట్టగా, 14 షేర్లు నష్టపోయాయి. మొత్తం 1,595 షేర్లు నష్టాల పాలవ్వగా, 1,315 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.3,550 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.17,229 కోట్లుగా, డెరివేటివ్స్ విభాగంలో రూ.2,18,483 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.183 కోట్ల నికర అమ్మకాలు జరపగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.281 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. ఆసియా మార్కెట్లన్నీ దాదాపు లాభాల్లో ముగియగా, యూరప్ మార్కెట్లు మాత్రం నష్టాల్లో ముగిశాయి.
నేడు మార్కెట్‌కు సెలవు
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు సెలవు.