దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు
దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు
Published Wed, May 10 2017 4:05 PM | Last Updated on Tue, Sep 5 2017 10:51 AM
దలాల్ స్ట్రీట్ లో మార్కెట్లు దుమ్మురేపాయి. మంచి రుతుపవనాల అంచనాలతో సరికొత్త ఆల్ టైమ్ గరిష్టంలో మార్కెట్లు ముగిశాయి. 314.92 పాయింట్లు ర్యాలీ జరిపిన సెన్సెక్స్, 30,248.17 వద్ద క్లోజైంది. అదేవిధంగా నిఫ్టీ సైతం మొదటిసారి 9400 మార్కును అధిగమించి 9407.30 వద్ద రికార్డైంది. నేటి మార్కెట్లు భారతీ ఎయిర్ టెల్ స్టాక్ ఆఫ్ ది డేగా నిలిచి, 10 శాతం లాభాలు పండించింది. భారతీ ఎయిర్ టెల్ తో పాటు హిందూస్తాన్ యూనిలివర్ కూడా గరిష్ట స్థాయిలను తాకింది. క్లోజింగ్ కు ముందు సెన్సెక్స్ , నిఫ్టీలు నేటి ట్రేడింగ్ లో 30,272 మార్కును, 9414.75 మార్కును తాకాయి. మంగళవారం వెల్లడించిన మంచి రుతుపవనాల అంచనాలు మార్కెట్ల సెంటిమెంట్ ను బలపర్చాయని ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్, సెక్యురిటీస్ రీసెర్చ్ హెడ్ ఏకే ప్రభాకర్ తెలిపారు.
ఎల్ నిలో భయాందోళనలు కొంత తగ్గుముఖం పట్టాయని సాధారణంతో పోలిస్తే 50 శాతం అధికంగా వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ ఆఫీసు చీఫ్ అంచనావేశారు. అటు రుతుపవనాల అంచనాలతో పాటు ఇటు మంగళవారం సెషన్లో 330 కోట్ల విలువైన షేర్లను ఫారిన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కొనుగోలు చేయడం కూడా మార్కెట్లకు బూస్ట్ నిచ్చింది. మంచి కొనుగోళ్ల పర్వంతో బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1 శాతం పైకి ఎగిశాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 32 పైసలు బలహీనపడి 64.63గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 112 రూపాయల లాభంతో 28,083గా రికార్డయ్యాయి.
Advertisement
Advertisement