కొత్తగా ప్రారంభించిన షోరూంలో రోలాండ్, సిల్వర్ స్టార్ షోరూం ఎండీ అమిత్ రెడ్డి
♦ డీజిల్ కార్లకు తరగని ఆదరణ
♦ మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ రోలాండ్ ఫాల్గర్
♦ భాగ్యనగరిలో రెండో షోరూం ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ డిసెంబరుకల్లా మరో నాలుగు మోడళ్లను భారత్‌లో ప్రవేశపెడుతోంది. ఇప్పటికే ఈ ఏడాది ఎనిమిది మోడళ్లను విడుదల చేశామని సంస్థ ఇండియా ఎండీ రోలాండ్ ఎస్ ఫాల్గర్ తెలిపారు. హైదరాబాద్‌లో మెర్సిడెస్ రెండవ షోరూం సిల్వర్ స్టార్‌ను ప్రారంభించిన సందర్భంగా సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. 2015లో 13,502 కార్లను విక్రయించామన్నారు. ఈ ఏడాది సైతం ఇదే స్థాయిలో అమ్మకాలను ఆశిస్తున్నట్టు చెప్పారు. 2016 జనవరి-సెప్టెంబరులో 9,927 కార్లు అమ్ముడయ్యాయి. ఎన్‌సీఆర్ ప్రాంతంలో డీజిల్ కార్ల అమ్మకాలపై ఇబ్బందులు తలెత్తినప్పటికీ మంచి వృద్ధిని నమోదు చేశామన్నారు. కంపెనీ విక్రయాల్లో హైదరాబాద్ వాటా 5 శాతముంది.
డీజిల్ కార్లంటే మక్కువే..
ఢిల్లీలో డీజిల్ కార్ల కొత్త రిజిస్ట్రేషన్లను కొద్ది రోజులు నిషేధించిన సంగతి తెలిసిందే. డీజిల్ కార్లపై ప్రస్తుతం దేశ రాజధానిలో 1 శాతం పర్యావరణ రుసుం వసూలు చేస్తున్నారు. కస్టమర్లు ఈ రుసుం చెల్లించేందుకూ వెనుకాడ్డం లేదని రోలాండ్ వ్యాఖ్యానించారు. డీజిల్ నుంచి పెట్రోల్ వైపు పెద్దగా మొగ్గు చూపడం లేన్నారు. తదుపరి ప్రభుత్వం తీసుకునే చర్యలు ఎలా ఉండబోతున్నాయోనని చాలా మంది కస్టమర్లు వేచి చూస్తున్నారని వివరించారు. అన్ని ప్రమాణాలకు లోబడే వాహనాలను తయారు చేస్తున్నామని చెప్పారు. ప్రమాణాల్లో లోపముంటే వాటిని సరిదిద్దాలని సూచించారు.
కార్ల ధరలపై జీఎస్‌టి..
లగ్జరీ కార్లపై జీఎస్‌టి ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై స్పష్టత లేదని రోలాండ్ అన్నారు. అందుకే వాహనాల ధరలు తగ్గుతాయా, పెరుగుతాయా అన్న అంశంపై అనిశ్చితి ఉందని చెప్పారు. భారత్ స్టేజ్-6 ప్రమాణాలకు అనుగుణంగా 2018 కల్లా డీజిల్, పెట్రోల్ కార్లను ప్రవేశపెడతామని వెల్లడించారు. కాగా, షోరూం ప్రారంభించిన నాడే 30 కార్లు రోడ్డెక్కాయని సిల్వర్ స్టార్ ఎండీ అమిత్ రెడ్డి తెలిపారు. 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.37 కోట్ల వ్యయంతో షోరూం నెలకొల్పినట్టు చెప్పారు.
కొత్త ‘జీఎల్‌ఏ’ వేరియంట్ ధర రూ.38.51 లక్షలు
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్ బెంజ్’ తాజాగా తన ప్రముఖ ఎస్‌యూవీ ‘జీఎల్‌ఏ’లో ఫోర్-వీల్ డ్రైవ్ వేరియంట్ ‘జీఎల్‌ఏ 220 డి యాక్టివిటీ ఎడిషన్’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.38.51 లక్షలు (ఎక్స్‌షోరూమ్ పుణే)గా ఉంది. తాజా వేరియంట్‌తో కలుపుకుని కంపెనీ ఈ ఏడాది మొత్తంగా మన దేశంలోకి తొమ్మిది ప్రొడక్టులను ప్రవేశపెట్టింది. అలాగే కంపెనీ నుంచి మార్కెట్‌లోకి వచ్చిన 6వ ఎస్‌యూవీ ఇది.