మళ్లీ నోకియా మొబైల్స్ వస్తున్నాయ్!
మైక్రోసాఫ్ట్ నుంచి హెచ్‌ఎండీ గ్లోబల్‌కు బ్రాండ్
హెల్సింకి/న్యూఢిల్లీ: మళ్లీ నోకియా బ్రాండ్లు ఫోన్లు, ట్యాబ్‌లు మార్కెట్లోకి రానున్నాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ నోకియా బ్రాండ్ హక్కులను హెచ్‌ఎండీ గ్లోబల్‌కు ఫాక్స్‌కాన్ కంపెనీలకు 35 కోట్ల డాలర్లకు విక్రయించింది. మరోవైపు కొత్తగా ఏర్పాటు చేసిన హెచ్‌ఎండీ గ్లోబల్ లిమిటెడ్‌కు నోకియా బ్రాండ్ ఎక్స్‌క్లూజివ్ గ్లోబల్ లెసైన్స్‌ను పదేళ్లపాటు ఇచ్చామని నోకియా పేర్కొంది. దీంతో హెచ్‌ఎండీ గ్లోబల్, ఈ సంస్థ తైవాన్ భాగస్వామి ఎఫ్‌ఐహెచ్ మొబైల్ ఆఫ్ ఫాక్స్‌కాన్ టెక్నాలజీలు ఇక నోకియా బ్రాండ్ మొబైళ్లను విక్రయిస్తాయి.
1998-2011 మధ్య కాలంలో మొబైల్ ఫోన్ల రంగంలో నోకియా కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది. కానీ ఆ తర్వాత శామ్‌సంగ్ కంపెనీ స్మార్ట్‌ఫోన్లతో అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది. 2014లో తన హ్యాండ్‌సెట్ వ్యాపారాన్ని నోకియా కంపెనీ మైక్రోసాఫ్ట్‌కు విక్రయించింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఫీచర్ ఫోన్లకు మాత్రం నోకియా బ్రాండ్‌ను వాడి లూమియా బ్రాండ్ కింద స్మార్ట్‌ఫోన్లను విక్రయించింది. మైక్రోసాఫ్ట్‌తో కుదుర్చుకున్న బ్రాండ్ లెసైన్సింగ్ ఒప్పందం ఈ ఏడాది మధ్యకల్లా ముగియనున్నదని అంచనా.