మైక్రోసాఫ్ట్ చేతికి లింక్డ్ఇన్ | Microsoft to buy LinkedIn for $26.2 billion; LNKD shares jump 47% | Sakshi
Sakshi News home page

మైక్రోసాఫ్ట్ చేతికి లింక్డ్ఇన్

Published Tue, Jun 14 2016 12:48 AM | Last Updated on Mon, Sep 4 2017 2:23 AM

మైక్రోసాఫ్ట్ చేతికి లింక్డ్ఇన్

మైక్రోసాఫ్ట్ చేతికి లింక్డ్ఇన్

డీల్ విలువ రూ.1,75,000 కోట్లు..
పూర్తి నగదు రూపంలో కొనుగోలు.. 
ఒక్కో షేరుకి 196 డాలర్లు చెల్లించేందుకు ఓకే
మైక్రోసాఫ్ట్ చరిత్రలో ఇదే అతిపెద్ద కొనుగోలు డీల్...
కంపెనీ సీఈఓగా సత్య నాదెళ్ల పగ్గాలు చేపట్టాక జరిగిన భారీ ఒప్పందం కూడా

న్యూయార్క్: ప్రపంచ టెక్నాలజీ రంగంలో మరో అతిపెద్ద డీల్‌కు మైక్రోసాఫ్ట్ తెరతీసింది. వివిధ వ్యాపార రంగాలకు చెందిన నిపుణులు, ఉద్యోగులు, సంస్థలకు ఆన్‌లైన్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌గా పనిచేస్తున్న లింక్డ్‌ఇన్‌ను చేజిక్కించుకుంటున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ డీల్ కోసం ఏకంగా 26.2 బిలియన్ డాలర్ల మొత్తాన్ని(దాదాపు రూ.1.75 లక్షల కోట్లు) చెల్లించనున్నట్లు తెలిపింది. మైక్రోసాఫ్ట్ చరిత్రలో ఇదే అతిపెద్ద కొనుగోలు ఒప్పందం కావడంతోపాటు... సత్య నాదెళ్ల కంపెనీ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన భారీ డీల్ కూడా ఇదే కావడం గమనార్హం. పూర్తిగా నగదు రూపంలో ఈ కొనుగోలు ఒప్పందం ఉంటుందని.. లింక్డ్‌ఇన్‌కు చెందిన ఒక్కో షేరుకి 196 డాలర్ల చొప్పున విలువ కట్టినట్లు మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో పేర్కొంది.

అమెరికాలోని న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో గత శుక్రవారం నాటి ముగింపు ధరతో పోలిస్తే మైక్రోసాఫ్ట్ చెల్లింస్తున్న ప్రీమియం దాదాపు 50 శాతం అధికం కావడం గమనార్హం. మరోపక్క, విశిష్టమైన లింక్డ్‌ఇన్ బ్రాండ్‌ను యథాతథంగా కొనసాగించనున్నామని.. స్వతంత్ర కంపెనీగానే కొనసాగించనున్నట్లు కూడా మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీ సీఈఓగా వ్యవహరిస్తున్న జెఫ్ వీనర్ బాధ్యతల్లో ఎలాంటి మార్పులూ ఉండబోవని.. ఆయన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఆధ్వర్యంలో పనిచేస్తారని కంపెనీ వివరించింది. లింక్డ్‌ఇన్ సహ-వ్యవస్థాపకుడు మెజారిటీ వాటాదారుతో పాటు చైర్మన్ కూడా అయిన రీడ్ హాఫ్‌మన్, వీనర్‌లు ఇరువురూ ఈ డీల్‌కు పూర్తి మద్దతు       తెలిపారని మైక్రోసాఫ్ట్ ప్రకటన పేర్కొంది. ఈ ఏడాది చివరికల్లా ఒప్పందం పూర్తవుతుందని అంచనా.

 నిధుల కోసం కొత్త రుణాలు...
లింక్డ్‌ఇన్ కొనుగోలుకు సంబంధించిన నిధుల కోసం కొత్తగా రుణాలను సమీకరించనున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. డీల్ పూర్తయిన తర్వాత లింక్డ్‌ఇన్ ఆర్థికాంశాలన్నింటినీ మైక్రోసాఫ్ట్ తన ప్రొడక్టివిటీ అండ్ బిజినెస్ ప్రాసెస్ విభాగంలో భాగంగా చూపనుంది. కాగా, గత ప్రణాళికలకు అనుగుణంగా ఈ ఏడాది డిసెంబర్‌కల్లా తమ 40 బిలియన్ డాలర్ల షేర్ల కొనుగోలు(బైబ్యాక్)ను పూర్తిచేస్తామని పునరుద్ఘాటించింది. ఈ ఒప్పందానికి సంబంధించి మైక్రోసాఫ్ట్‌కు మోర్గాన్ స్టాన్లీ ప్రత్యేక ఫైనాన్షియల్ అడ్వయిజర్‌గా... సింప్సన్ థాచెర్ అండ్ బార్లెట్ ఎల్‌ఎల్‌పీ లీగల్ అడ్వయిజర్‌గా ఉన్నాయి. కాగా, 2015లో మైక్రోసాఫ్ట్ నికర లాభం 12.2 బిలియన్ డాలర్లుకాగా, ఆదాయం 93.6 బిలియన్ డాలర్లుగా నమోదైంది.

 భారత్‌లోనూ కార్యాలయం...
భారత్‌లోనూ లింక్డ్‌ఇన్‌కు ప్రత్యక్ష కార్యకలాపాలు ఉన్నాయి. బెంగళూరులో ఒక పరిశోధన-అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ) కార్యాలయం ఉంది. ఇందులో సుమారు 650 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

 లింక్డ్‌ఇన్ సంగతిదీ...

బిజినెస్ ఆధారిత సోషల్ నెట్‌వర్కింగ్ సేవల్లో ప్రపంచ దిగ్గజంగా నిలుస్తోంది. ముఖ్యంగా ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ సైట్(డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.లింక్డ్‌ఇన్.కామ్)గా దీన్ని వ్యహహరిస్తున్నారు. వివిధ రంగాల నిపుణులు, కంపెనీలు దీనిలో తమ ప్రొఫైల్స్‌ను పెట్టుకోవచ్చు. యూజర్ల వివరాలను నియామక సంస్థలకు అందించడం ద్వారా ప్రధానంగా లింక్డ్‌ఇన్‌కు ఆదాయం లభిస్తోంది.

2002 డిసెంబర్‌లో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన మౌంటెన్ వ్యూలో ఈ సంస్థ ఆవిర్భవించింది. అధికారికంగా లింక్డ్‌ఇన్ వెబ్‌సైట్ మాత్రం 2003 మే 5న మొదలైంది.

కంపెనీ సహ వ్యవస్థాపకుడు ప్రస్తుత చైర్మన్ అయిన రీడ్ హాఫ్‌మన్ తన నివాసంలోని లివింగ్ రూమ్ వేదికగా లింక్డ్‌ఇన్‌ను ప్రారంభించారు.

అలెన్ బ్లూ, కాన్‌స్టాంటిన్ గుయెరికీ, ఎరిక్ లీ, జీన్ లూక్ వెయిలంట్‌లు దీనికి ఇతర సహ-వ్యవస్థాపకులు. కంపెనీలో నియంత్రణ వాటా మాత్రం చైర్మన్ రీడ్ హాఫ్‌మన్ చేతిలోనే ఉంది.

2011 మే నెలలో కంపెనీ ఐపీఓ ద్వారా(షేరు ధర 45 డాలర్లు) న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయింది. 2004లో గూగుల్ లిస్టింగ్ తర్వాత ఇంటర్నెట్ కంపెనీల ఐపీఓల్లో ఇదే అతిపెద్దదిగా నిలిచింది.

ఈ ఏడాది జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి 9,200 మంది ఉద్యోగులు ఉన్నారు. భారత్‌లోని బెంగళూరుతో సహా ప్రపంచవ్యాప్తంగా 30 నగరాల్లో ఆఫీసులున్నాయి. వీటిలో బీజింగ్, షికాగో, దుబాయ్, డబ్లిన్, హాంకాంగ్, లండన్‌లు కొన్ని.

లింక్డ్‌ఇన్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 43.3 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.   ఇందులో 9.2 కోట్ల యూజర్లు ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి చెందినవారే. యూజర్ల సంఖ్యలో ఏటా 19 శాతం వృద్ధి నమోదవుతోంది.

ఇక త్రైమాసికంగా చూస్తే యూజర్లకు చెందిన ప్రొఫైల్ పేజీలకు 4,500 కోట్ల వ్యూస్(పేజీలను చూడటం) లభిస్తున్నట్లు అంచనా. దీనిలో 34 శాతం వృద్ధి ఉన్నట్లు కంపెనీ చెబుతోంది.

2016 పూర్తి ఏడాదికి తమ ఆదాయం 3.63-3.7 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. 2015 ఆదాయం 2.99 బిలియన్ డాలర్లు కాగా, 16.5 కోట్ల డాలర్ల నష్టం ప్రకటించింది. కాగా, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆదాయం 35 శాతం వృద్ధితో 86.1 కోట్ల డాలర్లుగా నమోదైంది.

 మైక్రోసాఫ్ట్ కొనుగోళ్ల పర్వం...
సాఫ్ట్‌వేర్, టెక్నాలజీ రంగంలో ప్రపంచ దిగ్గజంగా వెలుగొందుతున్న మైక్రోసాఫ్ట్.. 1987లో తొలిసారిగా ఫోర్‌థాట్ అనే కంపెనీని చేజిక్కించుకోవడం ద్వారా కొనుగోళ్ల పర్వాన్ని ఆరంభించింది.

2002లో నావిసన్‌ను 1.45 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.

2011లో స్కైప్‌ను 8.5 బిలియన్ డాలర్లకు చేజిక్కించుకుంది.

ఇక 2012లో యామెర్(1.2 బిలియన్ డాలర్లు), 2013లో నోకియా మొబైల్ హ్యాండ్‌సెట్ వ్యాపారం(9.4 బిలియన్ డాలర్లు), 2014లో మొజాంగ్(2.5 బిలియన్ డాలర్లు) మైక్రోసాఫ్ట్ ఖాతాలోకి చేరాయి.

ప్రపంచంలోని వివిధ వ్యాపా రంగాల్లో ఉన్న నిపుణులందరినీ అనుసంధానించేవిధంగా లింక్డ్‌ఇన్ బృందం అత్యద్భుతమైన ప్లాట్‌ఫామ్‌ను నెలకొల్పింది. దీన్ని ఒక గొప్ప సంస్థగానే నేను ఎప్పడూ భావిస్తుంటాను. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ చెంతకు చేరడం ద్వారా అటు లింక్డ్‌ఇన్ వృద్ధి జోరందుకోవడంతోపాటు ఆఫీస్ 365కు కూడా మరింత చొచ్చుకెళ్లేందుకు దోహదం చేస్తుంది. అంతేకాదు ప్రపంచంలోని ప్రతి వ్యక్తి, సంస్థ సామర్థ్యాలను పెంపొందించడం కోసం మేం చేస్తున్న ప్రయత్నాలకు కూడా లింక్డ్‌ఇన్ కొనుగోలు తోడ్పాటుగా నిలుస్తుంది. ఈ కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ చాన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. కంపెనీ చైర్మన్ రీడ్, సీఈఓ జెఫ్‌లతో జరిగిన చర్చల తర్వాత డీల్ కొలిక్కి రావడం సంతోషం కలిగిస్తోంది.  - లింక్డ్‌ఇన్‌తో డీల్‌పై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల

లింక్డ్‌ఇన్ కొనుగోలు పూర్తయితే మైక్రోసాఫ్ట్‌కు సరికొత్త అవకాశాలతో పాటు ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. నా హయాంలోనే కాకుండా కంపెనీ చరిత్రలో ఇదే అతిపెద్ద కొనుగోలు కూడా. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నా. గతంలో మన కంపెనీకి ఉన్న మార్కెట్ పరిమాణం 200 బిలియన్ డాలర్లుగా ఉండగా... ఇప్పుడు 315 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
- మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు ఈ-మెయిల్‌లో నాదెళ్ల

ఉద్యోగ, వ్యాపారావకాశాలకు సంబంధించి ప్రపంచాన్ని అనుసంధానించడంలో మేం ఒక కొత్త ఒరవడిని సృష్టించాం. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ చెంతకు చేరడం ద్వారా లింక్డ్‌ఇన్ నెట్‌వర్క్‌కు క్లౌడ్ నెట్‌వర్క్ కూడా తోడవనుండటంతో ప్రపంచ పనితీరును కూడా సమూలంగా మార్చేసే అవకాశం లభిస్తుంది. - జెఫ్ వీనర్, లింక్డ్‌ఇన్ సీఈఓ

 మైక్రోసాఫ్ట్ చేపడుతున్న ఈ కొనుగోలు లింక్డ్‌ఇన్‌కు పునరుత్తేజం కల్పిస్తుంది.  - రీడ్ హాఫ్‌మన్, లింక్డ్‌ఇన్ సహ-వ్యవస్థాపకుడు, చైర్మన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement