
క్రెడాయ్ న్యాట్‌కాన్ సదస్సు–2019ను ప్రారంభిస్తున్న ప్రతినిధులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇండియా – ఇజ్రాయెల్ దేశాల మధ్య ఇన్నాళ్లుగా రక్షణ, వ్యవసాయ రంగాల్లో మాత్రమే ద్వైపాక్షిక వాణిజ్యం జరిగిందని, ఇక నుంచి సాంకేతికత, మౌలిక, నిర్మాణ రంగాల్లో బలపడాల్సిన అవసరముందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆకాంక్షించారు. అన్ని రంగాల్లో మాదిరిగా మౌలిక, నిర్మాణ రంగంలోనూ సాంకేతికత, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్సీ (ఏఐ), రోబోటిక్స్ వంటి ఆధునిక టెక్నాలజీ వినియోగం పెరగాలని చెప్పారాయన. అప్పుడే నిర్మాణాలు వేగవంతం కావటంతో పాటూ ఉత్పాదక వ్యయం తగ్గుతుందని, దీంతో ధరలు కూడా తగ్గే అవకాశముంటుందని తెలియజేశారు. ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్ నగరంలో కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) న్యాట్‌కాన్ సదస్సు– 2019 మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి నెతన్యాహు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
102 మిలియన్ డాలర్ల రియల్టీ...
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇజ్రాయిల్ గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇఫత్ షాషా బిటోన్ మాట్లాడుతూ.. ‘‘1992లో ఇండియా– ఇజ్రాయిల్ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రారంభమైంది. మొదట్లో 200 మిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం.. ప్రస్తుతం 5.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో రియల్ ఎస్టేట్ వాటా 102 మిలియన్ డాలర్లుగా ఉంది’’ అని తెలియజేశారు. మౌలిక, నిర్మాణ రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షి వాణిజ్యం మరింత బలపడాలని సూచించారు. ఇప్పటికే నరేంద్ర మోదీ ఇజ్రాయిల్‌ను రెండు సార్లు సందర్శించారని, వచ్చే నెలలో మరోసారి పర్యటించనున్నారని తెలియజేశారు.
ప్రతికూలంలో రియల్టీ...
రెరా, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ వంటి కొత్త చట్టాల్ని రియల్ ఎస్టేట్ రంగంలో అమలు చేయటం అంత సులువైన విషయం కాదని, దీనికి కొంత సమయం పడుతుందని అప్పటివరకు ప్రతికూల పరిస్థితులు తప్పవని హెచ్‌డీఎఫ్‌సీ ఎండీ రేణు సూద్ కర్నాడ్ చెప్పారు. స్వల్పకాలంలో రియల్టీలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో శాశ్వత ప్రయోజనాలు దక్కుతాయని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా బ్యాంకింగ్, మార్కెట్ వ్యవస్థలో నిధుల సమస్య ఉందని, అందుకే ప్రాజెక్ట్ ఫండింగ్ పూర్తి స్థాయిలో జరగట్లేదని తెలియజేశారు. అంతిమ కొనుగోలుదారుడిని దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్, కన్‌స్ట్రక్షన్, ఫండింగ్ ప్లాన్ చేసుకోవాలని కర్నాడ్ సూచించారు. ఈ కార్యక్రమంలో టెల్ అవీవ్ డెప్యూటీ మేయర్ అసఫ్ హరెల్, ఇండియా ఇజ్రాయిల్ అంబాసిడర్ పవన్ కపూర్, సీబీఆర్‌ఈ ఇండియా చైర్మన్ అండ్ సీఈఓ అన్షుమన్ మేగజైన్, క్రెడాయ్ చైర్మన్ జక్షయ్ షా, నేషనల్ ప్రెసిడెంట్ సతీష్ మగర్, న్యాట్‌క్యాన్ కన్వినర్ గుమ్మి రాంరెడ్డి, కో–కన్వినర్ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశంలోని 200కు పైగా క్రెడాయ్ చాప్టర్ల నుంచి 1,200 మందికి పైగా డెవలపర్లు పాల్గొన్నారు.