భారత మార్కెట్లలో లిక్విడిటీ సూపర్ సైకిల్
డ్రీమ్ రన్ మొదలైంది: మోర్గాన్ స్టాన్లీ
న్యూఢిల్లీ: భారత ఈక్విటీ మార్కెట్లు బలమైన నిధుల ప్రవాహం మధ్యలో ఉన్నాయని, డ్రీమ్ రన్ ఇప్పుడే మొదలైందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. దీన్ని దేశీయంగా నిధుల ప్రవాహ సూపర్ సైకిల్ (దీర్ఘకాలం)గా అభివర్ణించింది. వరుసగా 17వ నెల అయిన ఆగస్ట్‌లో నిధులు సానుకూలంగానే ఉన్నట్టు తెలిపింది. దేశీయ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 3.9 బిలియన్ డాలర్ల (25,000 కోట్లు) నిధుల్ని స్వీకరించినట్టు, ఒక నెలలో ఈ స్థాయి నిధులు రావడం ఇదే మొదటిసారని, ఈటీఎఫ్‌లను కూడా కలిపితే ఇది 4.1 బిలియన్ డాలర్లు ఉంటుందని తన నివేదికలో మోర్గాన్ స్టాన్లీ వివరించింది.
ఈ ఏడాది ఇప్పటి వరకు దేశీయ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి 18.6 బిలియన్ డాలర్ల (రూ.1.19 లక్షల కోట్లు) నిధులు వచ్చాయని, ఈటీఎఫ్ లోకి వచ్చిన నిధులు 2.6 బిలియన్ డాలర్లు (16,640 కోట్లు)గా ఉన్నట్టు తెలిపింది. ‘‘ఆగస్ట్ చివరి నాటికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తుల విలువ 111 బిలియన్ డాలర్లు (రూ.7.10 లక్షల కోట్లు)గా ఉంది. మార్కెట్ క్యాప్ 5.3 శాతానికి పెరిగింది. 2000 తర్వాత ఇదే గరిష్ట స్థాయి.
3.2 శాతం స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం
వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్ట్ నెలకు సంబంధించి 3.2 శాతంగా ఉండొచ్చని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. ఆహారం, నూనెల ధరలు పెరగడంతో ఈ మేరకు అంచనా వేసింది. జూలైలో ఇది 2.4 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే, టోకు ద్రవ్యోల్బణం సైతం ఆగస్ట్ నెలలో 2.9 శాతానికి పెరుగుతుందని మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో అంచనా వేసింది. దేశ కరెంట్ ఖాతా లోటు ఏప్రిల్–జూన్ క్వార్టర్‌లో 11.2 బలియన్ డాలర్లకు విస్తరిస్తుందని ఈ సంస్థ పేర్కొంది. అయినప్పటికీ కరెంటు ఖాతా లోటు ఆర్‌బీఐకి అనుకూలమైన జోన్‌లోనే కొనసాగుతుందని తెలిపింది. అధిక నూనె ధరలు, అననుకూలమైన బేస్ ప్రభావంతో ఎగుమతులు, దిగుమతుల వృద్ధి వార్షికంగా చూస్తే మోస్తరుగా ఉంటుందని పేర్కొంది.