నేడు ఆర్‌బీఐ కీలక పాలసీ నిర్ణయం
ప్రారంభమైన ఎంపీసీ సమావేశం
ముంబై: రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక ద్రవ్య పరపతి విధాన నిర్ణయం బుధవారం వెలువడనుంది. గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని రెండు రోజుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) భేటీ మంగళవారం ఆరంభమైంది. దేశ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై ఈ ద్వితీయ ద్వైమాసిక సమావేశం రెండు రోజుల పాటు చర్చిస్తుంది. బలహీనంగా పారిశ్రామిక వృద్ధి, గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి–మార్చి)లో కేవలం 6.1 శాతం స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు నమోదయిన నేపథ్యంలో, వృద్ధికి ఊతం ఇవ్వడానికి రెపోను (బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.25 శాతం) మరింత తగ్గించాలని పారిశ్రామిక రంగం కోరుతోంది.
తక్కువ స్థాయి ద్రవ్యోల్బణాన్ని కారణంగా చూపుతూ ప్రభుత్వం కూడా రెపోను తగ్గించాలనే భావిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఈ రేటును తగ్గించే అవకాశం లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జూలై 1వ తేదీ నుంచీ అమలవుతుందని భావిస్తున్న జీఎస్‌టీ ప్రభావం ద్రవ్యో ల్బణంపై ఏమేరకు ఉంటుందన్న అంశాన్ని ఎంపీ సీ చర్చిస్తుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.