న్యూఢిల్లీ: ఏదీ శాశ్వతం కాదంటారు.. మార్పు సహజమంటారు.. అన్నీ మారతాయంటారు.. కానీ ఇక్కడ ఒకటి మాత్రం స్థిరంగా ఉంటూ వస్తోంది. అదేంటనుకుంటున్నారా? ఫోర్బ్స్ జాబితాలో తొలి స్థానం. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ అయిన ఫోర్బ్స్ తాజాగా ‘ఇండియాలోని వంద మంది బిలియనీర్ల జాబితా–2017’ను విడుదల చేసింది.
ఇందులో మొదటి స్థానాన్ని మరోసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముకేశ్ అంబానీయే దక్కించుకున్నారు.అంబానీ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంటూ రావడం ఇది వరుసగా పదోసారి. ఆయన నికర సంపద విలువ దాదాపు రూ.2.5 లక్షల కోట్లుగా (38 బిలియన్ డాలర్లు) ఉంది. గతేడాదితో పోలిస్తే అంబానీ సంపద 15.3 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ఆయన ఆసియాలోని టాప్–5 కుబేరుల్లో ఒకరిగా నిలిచారు.
రిఫైనింగ్ మార్జిన్లు మెరుగుపడటం, రిలయన్స్ జియో విజయవంతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర పరుగులు పెట్టడం వంటివి అంబానీ సంపద పెరుగుదలకు కారణం. కాగా ఈ వంద మంది జాబితాలో అందరూ బిలియనీర్లే. కనీసం 1.46 బిలియన్ డాలర్ల సంపద ఉన్నవారే జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. గతేడాది ఈ పరిమితి 1.25 బిలియన్ డాలర్లుగా ఉంది.
‘భారత ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ జాబితాలో ఉన్నవారి మొత్తం సంపద విలువ 26 శాతం వృద్ధితో రూ.31 లక్షల కోట్లకుపైగా (479 బిలియన్ డాలర్లు) ఎగిసింది.
♦ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు మూడేళ్ల కనిష్ట స్థాయి 5.7 శాతానికి పడిపోయింది. దీనికి పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలుపై నెలకొని ఉన్న అనిశ్చితి వంటి అంశాలు ప్రధాన కారణం. అయితే స్టాక్ మార్కెట్ మాత్రం కొత్త గరిష్టాలకు చేరింది. ఇది దేశంలోని వంద మంది ధనికుల సంపద పెరుగుదలకు దోహదపడింది’ అని వివరించింది. షేర్ హోల్డింగ్స్, ఇతర ఫైనాన్షియల్ ఇన్‌ఫర్మేషన్ ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు తెలిపింది.
♦ గతేడాది రెండో స్థానంలో ఉన్న సన్ ఫార్మా దిలీప్ సంఘ్వీ ఈ సారి తొమ్మిదో స్థానానికి పడిపోయారు. ఈయన సంపద విలువ 12.1 బిలియన్ డాలర్లుగా ఉంది.
♦ ముకేశ్ సోదరుడు అనిల్ అంబానీ 45వ స్థానంతో సరిపెట్టుకున్నారు. సంపద విలువ 3.15 బిలియన్ డాలర్లు.
♦ అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ 13 నుంచి పదో స్థానానికి ఎగబాకారు. ఈయన సంపద 6.3 బిలియన్ డాలర్ల నుంచి 11 బి. డాలర్లు.
♦ పతంజలి ఆయుర్వేద్‌కు చెంది న ఆచార్య బాలకృష్ణ 48వ స్థానం నుంచి ఏకంగా 19వ స్థానానికి చేరుకున్నారు. ఈయన సంపద విలువ దాదాపు రూ.43,000 కోట్లుగా (6.55 బిలియన్ డాలర్లు) ఉంది.
♦ జాబితాలో కొత్తగా స్థానం పొందిన వారిలో నుస్లీ వాడియా అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. ఈయన 5.6 బిలియన్ డాలర్ల సంపదతో 25వ స్థానంలో నిలిచారు.
♦ వెటరన్ ఇన్వెస్టర్ రాధాకిషన్ దమానీ మళ్లీ జాబితాలో స్థానం పొందారు. ఈయన 9.3 బిలియన్ డాలర్ల సంపదతో 12వ స్థానంలో నిలిచారు. ఈయనతో పాటు మరో ఇద్దరూ జాబితాలో మళ్లీ స్థానం పొందారు. వారిలో ఫ్యూచర్ గ్రూప్ కిశోర్ బియానీ మళ్లీ 2.75 బిలియన్ డాలర్లతో 55వ స్థానంలో ఉన్నారు.
ఫార్మా దిగ్గజాల సంపద ఆవిరి..
జాబితాలోని 12 మంది సంపద తగ్గింది. వీరిలో సగం మంది ఫార్మా రంగానికి చెందిన వారే ఉండటం గమనార్హం. దిలీప్ సంఘ్వీ సంపద విలువ గరిష్టంగా 4.8 బిలియన్ డాలర్ల మేర తగ్గింది. దీంతో ఈయన మూడేళ్ల నుంచి ఉంటూ వస్తున్న రెండో స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. లుపిన్ షేరు ధర పడిపోవడం వల్ల గుప్తా కుటుంబం 40వ స్థానానికి పడిపోయింది.
స్థానం పేరు సంపద
(బిలియన్ డాలర్లు)
1 ముకేశ్ అంబానీ 38
2 అజీమ్ ప్రేమ్‌జీ 19
3 హిందూజా బ్రదర్స్ 18.4
4 లక్ష్మీ మిట్టల్ 16.5
5 పల్లోంజి మిస్త్రీ 16
మహిళా బిలియనీర్లు ఏడుగురు..
ఫోర్బ్స్ వంద మంది బిలియనీర్లలో ఏడుగురు మహిళలు స్థానం దక్కించుకున్నారు. వీరిలో ఒ.పి.జిందాల్ గ్రూప్ చైర్‌పర్సన్ సావిత్రి జిందాల్ టాప్‌లో ఉన్నారు. ఈమె 7.5 బిలియన్ డాలర్ల సంపదతో 16వ స్థానంలో నిలిచారు. సావిత్రి జిందాల్ తర్వాతి స్థానంలో లుపిన్ ఫార్మాకు చెందిన గుప్తా కుటుంబం ఉంది. వీరు 3.45 బిలియన్ డాలర్ల సంపదతో 40వ స్థానంలో ఉన్నారు. వీరికి లుపిన్‌లో 47 శాతం వాటాలున్నాయి. మంజు దేశ్‌బంధు గుప్తా.. లుపిన్‌కు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు.
ఈమె లుపిన్ వ్యవస్థాపకులు దేశ్ బంధు గుప్తా భార్య. ఈయన ఈ ఏడాది జూన్‌లో చనిపోయారు. వినోద్ అండ్ అనిల్ రాయ్ గుప్తా కుటుంబం 3.11 బిలియన్ డాలర్ల సంపదతో 48వ స్థానంలో ఉంది. వీరికి హావెల్స్ ఇండియాలో 60 శాతం వాటాలున్నాయి. జైన్ కుటుంబం 3 బిలియన్ డాలర్ల సంపదతో 51వ స్థానంలో ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియాను ప్రచురించే మీడియా గ్రూపు బెన్నెట్ కోలెమన్ అండ్ కో వీరిదే.
అమాల్గమేషన్స్ గ్రూప్ కుటుంబం 63వ స్థానంలో ఉంది. వీరి సంపద విలువ 2.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ట్రాక్టర్ల కంపెనీ టఫే వీరిదే. లీనా తివారీ 2.19 బిలియన్ డాలర్ల సంపదతో 71వ స్థానంలో ఉన్నారు. ఈమె యూఎస్‌వీ ఇండియా చైర్‌పర్సన్. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా 2.16 బిలియన్ డాలర్ల సంపదతో 72వ స్థానంలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment