నాల్కో లాభం రెట్టింపు  | NALCO Net swells to Rs 1342 crore in FY18, pays record dividend | Sakshi
Sakshi News home page

నాల్కో లాభం రెట్టింపు 

Published Thu, Aug 30 2018 2:00 AM | Last Updated on Thu, Aug 30 2018 2:00 AM

NALCO Net swells to Rs 1342 crore in FY18, pays record dividend - Sakshi

భువనేశ్వర్‌: అల్యూమినియమ్‌ దిగ్గజ కంపెనీ నాల్కో (నేషనల్‌ అల్యూమినియమ్‌ కంపెనీ) నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రెట్టింపైంది. 2016–17లో రూ.669 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక  సంవత్సరంలో రూ.1,342 కోట్లకు పెరిగిందని నాల్కో తెలిపింది. గత పదేళ్లలో చూస్తే, ఇదే అత్యధిక లాభమని నాల్కో సీఎమ్‌డీ తపన్‌ కుమార్‌ చంద్‌ చెప్పారు. కొత్త వ్యాపార ప్రణాళిక కారణంగా తమ కంపెనీ కొత్త వృద్ధి పథంలోకి దూసుకుపోయిందని పేర్కొన్నారు. తమ కంపెనీ ఉద్యోగుల టీమ్‌ వర్క్, వ్యయ నియంత్రణ పద్ధతులపై దృష్టి పెట్టడం, వ్యూహాత్మక ప్లానింగ్‌...ఈ అంశాలు  కూడా తమ విజయానికి కారణాలని వివరించారు. మంగళవారం జరిగిన ఈ నవరత్న కంపెనీ 37వ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు.  

టర్నోవర్, ఎగుమతుల్లో కూడా రికార్డ్‌లు  
నికర లాభమే కాకుండా, టర్నోవర్‌ కూడా గత ఆర్థిక సంవత్సరంలో 26 శాతం వృద్ధితో రూ.9,376 కోట్లకు పెరిగిందని చంద్‌ పేర్కొన్నారు. ఎగుమతుల ఆదాయం 12 శాతం వృద్ధితో రూ.4,076 కోట్లకు ఎగసిందని, కంపెనీ చరిత్రలో ఇదే అత్యధికమని వివరించారు. నికర విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిన మూడో అతి పెద్ద కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ తమదేనని చెప్పారు.  

ఒక్కో షేర్‌కు రూ.5.70 డివిడెండ్‌.. 
రూ.5 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.5.70 డివిడెండ్‌ను చెల్లించడానికి ఏజీఎమ్‌ ఆమోదం తెలిపిందని తపన్‌ కుమార్‌ చంద్‌ తెలిపారు. కంపెనీ ప్రారంభమైన 1981 నుంచి చూస్తే, ఇదే అత్యధిక డివిడెండ్‌ అని వివరించారు. మొత్తం డివిడెండ్‌ చెల్లింపులు రూ.1,102 కోట్లుగా ఉంటాయని పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement