సాక్షి, ముంబై : ప్రయివేటు రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ సంక్షోభంలో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. సంస్థ ఫౌండర్, ప్రధాన ప్రమోటర్ నరేష్ గోయల్ సంస్థనుంచి వైదొలగే అవకాశం ఉందని తెలుస్తోంది. నరేష్ గోయల్‌తోపాటు ఆయన భార్య అనితా గోయల్ కూడా బోర్డుకు రాజీనామా చేయనున్నారని తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది.
జెట్‌ఎయిర్‌వేస్ సంక్షోభంపై చర్చించేందుకు బోర్డు ఈ రోజు సమావేశం కానుంది. ఈ సమావేశం అనంతరం దీనిపై ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇవాల్టి సమావేశంలో ఒక కొత్త తీర్మానాన్ని కూడా ఆమోదించనున్నారు. తద్వారా నరేష్ గోయల్ సొంతమైన 51 శాతం వాటాను కన్సా ర్షియం సొంతం చేసుకుంటుంది. కొత్త కొనుగోలుదదారుకోసం అన్వేషించనుంది.
అలాగే ఎస్‌బీఐ మాజీ ఛైర్మన్ మాజీ సీవీసీ కమిషనర్ జానకి వల్లభ్‌ను జెట్ ఎయిర్‌వేస్ బోర్డులోకి ఆహ్వానించనున్నారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న నరేష గోయల్ అక్కడినుంచే 23వేల ఉద్యోగులనుద్దేశించి ప్రసంగించనున్నారని సమాచారం. ఈ వార్తలు వాస్తవరూపం దాలిస్తే దాదాపు పాతికేళ్లపాటు సంస్థను విజయపధంలో నడిపించిన నరేష్ గోయల్ ప్రస్థానం ముగియనుంది.
మరోవైపు ఇప్పటికే పలువురు సీనియర్ ఉన్నతాధికారులు సంస్థను వీడగా, వేతన బకాయిలు చెల్లించకపోతే తాము కూడా రాజీనామా బాట పట్టక తప్పదని పైలట్లు హెచ్చరించారు. అటు అద్దె బకాయిలు చెల్లించలేక , పైలట్లులేక రోజు రోజుకు జెట్ ఎయిర్‌వేస్ రద్దవుతున్న విమానాల సంఖ్య పెరుగుతోంది.
కాగా సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న జెట్ ఎయిర్‌వేస్ మరింత తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రంతోపాటు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం నేతృత్వంలో భారీ రుణాలిచ్చిన బ్యాంకులు సంస్థను గట్టెక్కించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవలన సంస్థ మళ్లీ గాడిలో పడాలంటే నరేష్ గోయల్, ఆయన భార్య , మరో ఇద్దరు డైరెక్టర్లు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ సూచించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment