ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 నేపథ్యంలోనూ అమెరికా టెక్నాలజీ ఇండెక్స్ నాస్‌డాక్ సోమవారం సరికొత్త రికార్డ్ సృష్టించింది. 111 పాయింట్లు(1.15 శాతం) లాభపడటం ద్వారా 9,925 వద్ద ముగిసింది. వెరసి మార్కెట్ చరిత్రలో తొలిసారి చరిత్రాత్మక గరిష్టం వద్ద నిలిచింది. తద్వారా యూఎస్ మార్కెట్లలో బుల్ ట్రెండ్ నెలకొన్న సంకేతాలను ఇచ్చింది. ఫాంగ్(FAANG) స్టాక్స్ దన్నుతో ఇటీవల కొద్ది రోజులుగా దూకుడు చూపుతున్న నాస్‌డాక్ మార్చి 23న నమోదైన కనిష్టం నుంచి తాజాగా 45 శాతం బౌన్స్‌బ్యాక్‌ను సాధించింది. ఈ బాటలో రికార్డ్ గరిష్టాలకు.. ఎస్‌అండ్‌పీ 4.5 శాతం, డోజోన్స్ 6.7 శాతం దూరంలో నిలవడం విశేషం! కాగా.. సోమవారం డోజోన్స్ 461 పాయింట్లు(1.7 శాతం) జంప్‌చేసి 27,572 వద్ద స్థిరపడగా.. ఎస్‌అండ్‌పీ 38 పాయింట్లు(1.2 శాతం) పుంజుకుని 3,232 వద్ద ముగిసింది.
రివకరీ ఆశలు
అటు వైట్‌హౌస్, ఇటు ఫెడరల్ రిజర్వ్ భారీ సహాయక ప్యాకేజీలను అమలు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డవున్‌ను ఎత్తివేస్తున్న కారణంగా ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా బలపడనున్నట్లు అంచనాలు పెరుగుతున్నాయని తెలియజేశారు. దీంతో చౌకగా లభిస్తున్న పెట్టుబడులు స్టాక్ మార్కెట్లను ముంచెత్తుతున్నట్లు పేర్కొన్నారు. దీనికితోడు మే నెలలో ఉపాధి గణాంకాలు అంచనాలను మించుతూ ఆశావహంగా వెలువడటంతో సెంటిమెంటుకు జోష్‌వచ్చినట్లు తెలియజేశారు. నేటి నుంచి ఫెడరల్ రిజర్వ్ రెండు రోజులపాటు పాలసీ సమావేశాలను నిర్వహించనుంది. అవసరమైతే ఆర్థిక పురోగతికి మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు ఇప్పటికే ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ ప్రకటించడంతో ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
క్రూయిజర్ జోరు
కోవిడ్-19 కట్టడికి లాక్‌డవున్ అమలు కారణంగా దెబ్బతిన్న క్రూయిజర్, ఎయిర్‌లైన్స్ కంపెనీల కౌంటర్లకు ఇటీవల డిమాండ్ పెరిగింది. దీంతో సోమవారం సైతం కార్నివాల్ కార్ప్, నార్వేజియన్ క్రూయిజ్ లైన్‌తోపాటు ఎయిర్‌లైన్స్ షేర్లు భారీగా లాభపడ్డాయి. కాగా.. కొద్ది రోజులుగా నాస్‌డాక్ ఇండెక్స్‌కు టెక్ దిగ్గజాలు ఫేస్‌బుక్, అమెజాన్, అల్ఫాబెట్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్ అండగా నిలుస్తున్న విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment