ఎన్‌బీఎఫ్‌సీల నిబంధనలు కఠినతరం
ముంబై: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ కఠినతరం చేసింది. తాజా మార్పుల ప్రకారం ఎన్‌బీఎఫ్‌సీలు 2017 నాటికల్లా నెట్ ఓన్డ్ ఫండ్ (ఎన్‌వోఎఫ్)ను దశలవారీగా రూ. 2 కోట్లకు పెంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది రూ. 25 లక్షలుగా ఉంది. ఇందుకు సంబంధించి నిర్దేశిత మైలురాళ్లను అధిగమించలేని పక్షంలో వాటి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రద్దు చేసే ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని ఆర్‌బీఐ ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది.
అలాగే, బంగారు ఆభరణాలపై రుణాలిచ్చే సంస్థలు ఈక్విటీ మూలధనాన్ని కనీసం 12 శాతం మేర ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం ఇది 10 శాతంగా ఉంది. డిపాజిట్లు స్వీకరించే ఎన్‌బీఎఫ్‌సీలయితే ఈక్విటీ మూలధనాన్ని రెండేళ్లలో ప్రస్తుతం ఉన్న 7.5 శాతం నుంచి 10 శాతానికి పెంచుకోవాల్సి ఉంటుంది. అలాగే, ఇక 0.25 శాతంగా ఉన్న ప్రొవిజనింగ్‌ని 2018 మార్చి నాటికి 0.4 శాతానికి పెంచుకోవాల్సి ఉంటుంది.