రూ.200 నోట్లపై షాకింగ్‌ నిర్ణయం? | New Rs 200 notes not to be dispensed through ATMs? | Sakshi
Sakshi News home page

రూ.200 నోట్లపై షాకింగ్‌ నిర్ణయం?

Published Wed, Jul 5 2017 5:04 PM | Last Updated on Wed, Oct 17 2018 5:00 PM

రూ.200 నోట్లపై షాకింగ్‌ నిర్ణయం? - Sakshi

రూ.200 నోట్లపై షాకింగ్‌ నిర్ణయం?

న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుతో మార్కెట్లో నెలకొన్న చిల్లర కష్టాలకు చెక్‌ పెట్టేందుకు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా త్వరలోనే రూ.200 కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టబోతుంది. ఇప్పటికే వీటి ప్రింటింగ్‌ ఆర్డర్‌ కూడా షురూ అయింది. 2017 ఏడాది ముగియడానికి ముందే ఈ కొత్త నోట్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. దీని వల్ల లోయర్-డినామినేషన్‌ కరెన్సీకి సంబంధించిన డిమాండ్, సప్లై మధ్య అంతరం తగ్గుతుందని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొత్తగా తీసుకురాబోతున్న రూ.200 కరెన్సీ నోటుపై రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా షాకింగ్‌ నిర్ణయం కూడా తీసుకోబోతుందని తెలుస్తోంది. ఈ నోట్లను ఏటీఎంల ద్వారా అందించకూడదని యోచిస్తున్నట్టు తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. వీటిని కేవలం బ్యాంకు బ్రాంచుల వద్దనే సర్క్యూలేట్‌ చేయాలని ఆర్బీఐ చూస్తుందట.

అచ్చం రూ.10, రూ.20, రూ.50 కరెన్సీ నోట్ల మాదిరిగా ఈ కొత్త రూ.200 నోట్లు కూడా కేవలం బ్యాంకు బ్రాంచులోనే లభ్యం కానున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. గతేడాది నవంబర్‌లో పాత రూ.500, రూ.1000 నోట్లను కేంద్రప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ రద్దుతో మార్కెట్లోకి ఎక్కువగా కొత్త రూ.2000, రూ.500 సప్లయ్‌ చేయడంతో చిన్న నోట్ల సమస్య ఏర్పడింది. నోట్లు ఉన్నప్పటికీ వాటిని ఖర్చు చేయాలేని పరిస్థితి ప్రజల్లో నెలకొంది. దీంతో రూ.200 నోట్లను కొత్తగా తీసుకురావాలని ఆర్బీఐ నిర్ణయించింది. అయితే రద్దుచేసిన రూ.1000 నోటును ఇప్పట్లో తీసుకొచ్చే ఉద్దేశ్యాలు లేనట్టు ఆర్బీఐ వర్గాలు చెప్పాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement