దేశీయ ఈక్విటీ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రికార్డుల మోత మోగించాయి. మొట్టమొదటిసారి నిఫ్టీ తన అత్యంత కీలకమైన మార్కు 10,000కు పైన నిలిచింది.
నిఫ్టీ, సెన్సెక్స్ రికార్డుల మోత
Published Wed, Jul 26 2017 4:02 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 PM
ముంబై : దేశీయ ఈక్విటీ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రికార్డుల మోత మోగించాయి. మొట్టమొదటిసారి నిఫ్టీ తన అత్యంత కీలకమైన మార్కు 10,000కు పైన నిలిచింది. తీవ్ర దోబూచులాటల మధ్య నడిచిన నిఫ్టీ, మధ్యాహ్న ట్రేడింగ్ నుంచి పుంజుకుని, ఈ మైలురాయిని పునరుద్ధరించుకుంది. మంగళవారం ఆరంభంలో నిఫ్టీ 10వేల మార్కును తాకి, ఇన్వెస్టర్లలో కోలాహాలం నింపిన సంగతి తెలిసిందే. కానీ ఆ సంతోషం ఎంతో సేపు మిగలలేదు. వెనువెంటనే ఆ మార్కు నుంచి పడిపోయింది. నిన్నటి ట్రేడింగంతా మళ్లీ ఆ మార్కును అందుకోలేకపోయింది. కానీ బుధవారం ట్రేడింగ్‌లో నిఫ్టీ తన మార్కును మళ్లీ అందుకుని, ఇన్వెస్టర్లకు కొత్త ఆశలు చిగురించేలా చేసింది. ఆఖరి గంటల్లో జరిగిన స్ట్రాంగ్ ట్రేడింగ్‌తో మొట్టమొదటిసారి 10వేల మైలురాయి పైన, 56 పాయింట్ల లాభంలో 10020.65 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ సైతం రికార్డు వర్షం కురిపించింది. 154.19 పాయింట్ల లాభంలో 32,382.46 వద్ద రికార్డు స్థాయిలో నిలిచింది. గ్లోబల్‌గా కమోడిటీలు ర్యాలీ నిర్వహించడంతో మెటల్ స్టాక్స్ మెరుపులు మెరిపించాయి. మెటల్ స్టాక్స్‌తో పాటు ఫార్మా, బ్యాంకింగ్ స్టాక్స్ లాభాల వర్షం కురిపించాయి. దీంతో స్టాక్ మార్కెట్లు నూతన గరిష్టాలను నమోదుచేశాయి. ఆసియాలోనే బెస్ట్-పర్‌ఫార్మింగ్ ఇండెక్స్‌లలో నిఫ్టీ మూడో స్థానంలో నిలిచింది. వేదంత కంపెనీ షేర్లు మూడేళ్ల గరిష్టంలో 3.3 శాతం పైకి ఎగిశాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసలు బలపడి 64.35గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధరలు 138 రూపాయలు నష్టపోయి రూ.28,340గా ట్రేడయ్యాయి.
Advertisement
Advertisement