
32,000పైన సెన్సెక్స్...
రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రభావం
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) షేరు పరుగులు తీయడంతో స్టాక్ సూచీలు శుక్రవారం పటిష్టంగా ముగిసాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 124 పాయింట్లు ఎగిసి, తిరిగి 32,000 పాయింట్లస్థాయిపైన 32,029 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా ఇదేబాటలో 9,900 స్థాయిని అధిగమించి 42 పాయింట్ల పెరుగుదలతో 9,915 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
తీవ్ర హెచ్చుతగ్గులు...: క్రితం రోజు మార్కెట్ ముగిసిన తర్వాత ఆకర్షణీయ ఆర్థిక ఫలితాల్ని ఆర్‌ఐఎల్ వెల్లడించడంతో శుక్రవారం ఈ షేరుతో పాటు సూచీలు కూడా గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యాయి. అయితే అటుతర్వాత ఐటీ మినహా ఇతర రంగాల షేర్లలో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో సెన్సెక్స్ 100 పాయింట్ల వరకూ నష్టపోయి 31,800 పాయింట్ల వద్దకు పడిపోయింది. నిఫ్టీ సైతం 9,838 పాయింట్ల స్థాయికి క్షీణించింది.
అయితే అటుతర్వాత రిలయన్స్ ఏజీఎంలో ఆ కంపెనీ ఛైర్మన్ ముకేశ్ అంబానీ 1ః1 నిష్పత్తిలో బోనస్ ప్రకటన చేసిన తర్వాత ఆర్‌ఐఎల్ షేరు 9 సంవత్సరాల గరిష్టస్థాయి రూ. 1,590 వద్దకు చేరడం...కనిష్టస్థాయిల వద్ద ఇతర షేర్లకు కొనుగోలు మద్దతు లభించడంతో మార్కెట్ తిరిగి వేగంగా కోలుకుంది.జియో విస్తరణ, వినూత్న ప్రణాళికల్ని ప్రకటించడంతో మార్కెట్లో ఉత్తేజం కలిగిందని, ఐటీ షేర్లు, ప్రైవేటు బ్యాంకు షేర్లలో జరిగిన కొనుగోళ్లతో ఒడుదుడుకుల నుంచి సూచీలు కోలుకున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.