చైనా దెబ్బ: కుదేలైన భారత మార్కెట్లు
చైనా మార్కెట్ల ప్రభావం భారత మార్కెట్ల పై మరోసారి పడింది. చైనాలో షేర్లు ఒక్కరోజే 7 శాతం నష్టపోవడంతో అక్కడ ట్రేడింగ్ను గురువారం మొత్తం సస్పెండ్ చేశారు. అనంతరం భారత్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు కూడా నష్టాలతోనే మొదలయ్యాయి. మధ్యహ్నం 12 గంటల ప్రాంతానికి సెన్సెక్స్ 483 పాయింట్లు నష్టపోయి 24,922 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 150 పాయింట్లు నష్టపోయి 7590 వద్ద ట్రేడవుతోంది. చైనా ప్రభావం భారత మార్కెట్ల పైనే కాకుండా ఆసియా మార్కెట్లన్నింటిపై పడింది. జపాన్ మార్కెట్( నిక్కీ) 423 పాయింట్లు, హాంకాంగ్ మార్కెట్ (హాంగ్ సెంగ్) 627, సింగపూర్ మార్కెట్(స్ట్రేయిట్ టైమ్స్)60 పాయింట్ల నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఈ వారంలోనే చైనాలో సెల్ఆఫ్ కారణంగా మార్కెట్లను నిలిపివేయడం ఇది రెండో సారి. మార్కెట్లు ప్రారంభమైన 30 నిమిషాలకే భారీగా పతనం దిశగా కొనసాగడంతో చైనా స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ నిలిపివేశారు. గడచిన 25 ఏళ్లలో అతి తక్కువ సమయం చైనా మార్కెట్లు ట్రేడయింది ఈ రోజే.