
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకుని భారీ కుంభకోణంలో ముంచెత్తిన డైమాండ్ కింగ్ నీరవ్ మోదీ విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. తొలుత అతను స్విట్జర్లాండ్‌కు పారిపోయినట్టు వార్తలు రాగ, తర్వాత న్యూయార్క్‌లో ఉన్నట్టు రిపోర్టు పేర్కొన్నాయి. అతను ఎక్కడ ఉన్నది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. కానీ ప్రస్తుతం అతను హాంకాంగ్‌లో ఉన్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ పార్లమెంట్‌కు తెలిపింది. పీఎన్‌బీ కుంభకోణ కేసులో భాగంగా నీరవ్ మోదీని ప్రొవిజనల్ అరెస్ట్(తాత్కాలిక నిర్భందం) చేయాలని హాంకాంగ్ అథారిటీలను కోరినట్టు ప్రభుత్వం గురువారం పేర్కొంది.
‘హాంకాంగ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్‌ను, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను నీరవ్ దీపక్ మోదీని అరెస్ట్ చేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. 2018 మార్చి 23నే ఈ అభ్యర్థనను సమర్పించాం’ అని మంత్రిత్వ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ రాజ్యసభకు తెలిపారు. ఇప్పటికే మంత్రిత్వ శాఖ నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సిల పాస్‌పోర్టులను రద్దు చేసినట్టు కూడా సింగ్ చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేలకోట్ల రూపాయలను ముంచెత్తిన క్రమంలో రెండు నెలల క్రితం నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సిలపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌తో, వీరి పాస్‌పోర్టులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మోసం వెలుగులోకి రాకముందే వీరు దేశం విడిచి పారిపోయారు. అప్పటి నుంచి దర్యాప్తు సంస్థలు వీరిని వెనక్కి రప్పించాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment