ముంబై: జీ ఎంటర్‌టైన్మెంట్‌లో వాటా కొనుగోలు కోసం అంతర్జాతీయంగా పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. అమెరికాకు చెందిన కేబుల్ దిగ్గజం, కామ్‌కాస్ట్(అమెరికాలో ఎన్‌బీసీ యూనివర్శల్ సంస్థను నిర్వహిస్తోంది), కామ్‌కాస్ట్ మాజీ సీఎఫ్‌ఓ మైకేల్ ఏంజెలాకిస్ నేత్వత్వంలోని 400 కోట్ల డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ, ఎటైర్స్, సోనీ కార్ప్‌లను జీ కంపెనీ చర్చల నిమిత్తం షార్ట్‌లిస్ట్ చేసిందని సమాచారం.టెక్నాలజీ దిగ్గజం యాపిల్, భారత చమురు దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (జీ ఎంటర్‌టైన్మెంట్‌లో వాటా కొనుగోలు కోసం రంగంలో ఉన్న ఏకైక భారత కంపెనీ ఇదే)లు ఇప్పటికే తమ బిడ్‌లను సమర్పించాయి. కామ్‌కాస్ట్, అటైర్స్ కలిసి సంయుక్తంగా వాటా కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. చైనాకు చెందిన టెన్సెంట్, ఆలీబాబాలు కూడా రంగంలోకి వస్తాయనే అంచనాలున్నాయి. కానీ, ఇంతవరకూ ఇవి ఎలాంటి బిడ్‌లు సమర్పించలేదు.
జోరుగా చర్చలు...
జీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలో వాటా విక్రయ చర్చలు జోరుగానే సాగుతున్నాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. సంప్రదింపులు, మేనేజ్‌మెంట్‌లో చర్చలు అన్నీ విదేశాల్లోనే జరుగుతున్నాయని, కొన్ని చర్చలు సీరియస్‌గానే సాగుతున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని కంపెనీలు పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నాయని, సందర్భానికి తగ్గటు నిర్ణయాలు తీసుకోవడం కోసం వేచి చూస్తున్నాయని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాలపై కామ్‌కాస్ట్, సోనీ వ్యాఖ్యానించడానికి నిరాకరించాయి. ఇలాంటి ఊహాజనిత వార్తలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని జీ ప్రతినిధి పేర్కొన్నారు. వాటా విక్రయ ప్రక్రియ నిలకడగా కొనసాగుతోందని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అదనపు విషయాలు వెల్లడించలేమని పేర్కొన్నారు. అటైర్స్, యాపిల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఎలాంటి స్పందన ఇప్పటివరకూ వ్యక్తం చేయలేదు. బ్రియాన్ రాబర్ట్స్ నేతృత్వంలోని కామ్‌కాస్ట్ కంపెనీ మీడియా ఆస్తులను కొని, విక్రయించడం చేస్తోంది. ఈ కంపెనీ కేబుల్ నెట్‌వర్క్స్, బ్రాండ్‌బాండ్ అసెట్స్, కంటెంట్ ప్రొవైడర్స్, ఇంటర్నెట్ ప్రొవైడర్స్, యానిమేషన్ స్డూడియోలు వంటి మీడియా ఆస్తుల క్రయ, విక్రయాలు జరుపుతోంది.
రేసులో సోనీ ముందంజ...
ఈ రేసులో సోనీ కార్పొ ముందంజలో ఉందని సమాచారం. వేగంగా వృద్ధి చెందుతున్న భారత టీవీ, మీడియా, వినోద రంగాల్లో కామ్‌కాస్ట్, అటైర్స్, యాపిల్.. వంటి సంస్థలకు చెప్పుకోదగ్గ ఉనికి లేదు. ఈ సంస్థలు ఆరంభంలో ప్రమోటర్లతో సమానమైన వాటాను కొనుగోలు చేసి, 3–5 ఏళ్ల తర్వాత పూర్తి వాటాను కొనుగోలు చేస్తాయని అంచనాలున్నాయి. వినోద, మీడియా రంగాల్లో వంద శాతం వాటాను విదేశీ సంస్థలు కొనుగోలు చేయవచ్చు. అయితే సంక్లిష్టమైన, బహు భాషలతో కూడిన భారత మార్కెట్లో ఏ విదేశీ సంస్థకైనా స్థానిక భాగస్వామి తప్పనిసరి. భారత శాటిలైట్ టెలివిజన్ రంగంలో ముందుగానే ప్రవేశించిన కంపెనీల్లో సోనీ పిక్చర్స్‌నెట్‌వర్క్స్ ఇండియా (ఎస్‌పీఎన్) ఒకటి. వివిధ జోనర్ల కొత్త చానెళ్లను ఆరంభించే జోరును ఇటీవలనే మరింతగా పెంచింది. రెండేళ్ల క్రితం జీ స్పోర్ట్స్ బిజినెస్‌ను రూ.2,400 కోట్లకు కొనుగోలు చేసి తాజ్ టెలివిజన్(టెన్ స్పోర్ట్స్ బ్రాండ్)గా ప్రసారాలు చేస్తోంది. గత ఏడాది మరాఠి జనరల్ ఎంటర్‌టైన్మెంట్‌స్పేస్‌లోకి ప్రవేశించింది. ఇప్పుడు జీలో వాటా కొనుగోలు సోనీకి ఎంతగానే కలసివస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం ఎస్‌పీఎన్‌కు పట్టణ ప్రాంతాల్లోనే, హిందీ మాట్లాడే మార్కెట్లోనే వీక్షకులున్నారు. జీకి మాత్రం పట్టణ, గ్రామీణ ప్రాంతాలకూ పాతుకుపోయింది. మొత్తం భారత టెలివిజన్ వీక్షణ మార్కెట్లో జీ వాటా 20% పైనే ఉంటుందని అంచనా. జీలో వాటాను విక్రయిస్తామని సుభాష్ చంద్ర వెల్లడించిన కొన్ని రోజులకే సోనీ కీలక అధికారులు–మైక్ హాప్కిన్స్(సోమీ పిక్చర్స్ టెలివిజన్ చైర్మన్), టోనీ విన్సిక్యెరా (సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ చైర్మన్‌లు) సుభాష్ చంద్రను ఆయన నివాసంలో సందర్శించడం గమనార్హం.
కష్టాల్లో సుభాష్ చంద్ర...
జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌లో 50 శాతం వాటాను వ్యూహాత్మక భాగస్వామికి విక్రయించాలనుకుంటున్నట్లు గత ఏడాది నవంబర్‌లోనే కంపెనీ ప్రమోటర్ సుభాష్ చంద్ర వెల్లడించారు. అయితే, ఈ పరిణామం తర్వాత కంపెనీ షేరు భారీగా పతనమైంది. గత ఏడాది కాలంలో జీ ఎంటర్‌టైన్మెంట్ షేర్ 23 శాతం కుదేలైంది. దీంతో ఈ కంపెనీలో వాటాను ప్రీమియమ్ ధరకు విక్రయించాలన్న సుభాష్ చంద్ర ఆశలు వమ్మయ్యాయి. ఈ కంపెనీలో దేశీ, విదేశీ సంస్థలతో కలుపుకొని ప్రమోటర్ల మొత్తం వాటా 41.62%%. దేశీయ ప్రమోటర్ సంస్థల వాటాలో 85 శాతం వరకూ బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల వద్ద తాకట్టులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment