న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌పై (జీల్) టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కన్నేసింది. చౌక చార్జీలతో టెలికం రంగాన్ని కుదిపేసిన జియో... తాజాగా మీడియా కంటెంట్ విషయంలోనూ ఆధిపత్యం సాధించేందుకు వ్యూహాలు రచిస్తోంది. దీన్లో భాగంగా జీల్‌లో వాటాలు దక్కించుకోవడంపై దృష్టి సారిస్తోంది. ప్రమోటర్ సుభాష్ చంద్ర వాటాల్లో సగభాగాన్ని కొనుగోలు చేసేందుకు బరిలోకి దిగాలని జియో యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా అంతర్జాతీయ సంస్థలతోనే జట్టు కడతామంటూ వచిన జీల్ ప్రమోటర్లు... తాజాగా దేశీ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునే అవకాశాలూ పరిశీలిస్తామని చెప్పడంతో జియో బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే అమెజాన్, యాపిల్, టెన్సెంట్, ఆలీబాబా వంటి ఓవర్ ది టాప్ (ఓటీటీ) అంతర్జాతీయ దిగ్గజాలు రేసులో ఉన్నాయి. వీటితో పాటు ఏటీఅండ్‌టీ, సింగ్‌టెల్, కామ్‌కాస్ట్, సోనీ పిక్చర్స్ పేర్లు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
దేశీ ఇన్వెస్టరుకు విక్రయించే యోచన..
దీర్ఘకాలికంగా జీల్‌కు మరింత విలువ తెచ్చిపెట్టేలా కంపెనీని తీర్చిదిద్దగలిగే సామర్థ్యమున్న అంతర్జాతీయ సంస్థలకు సగం వాటా దాకా విక్రయించేందుకు సిద్ధమని 2018 నవంబర్‌లో సుభాష్ చంద్ర ప్రకటించారు. కాకపోతే, దేశీ ఇన్వెస్టర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఇటీవల జీల్ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ గోయెంకా చెప్పారు. ఈ దిశగా ఇప్పటికే కొన్ని సంస్థలతో చర్చలు కూడా మొదలెట్టామని, మరికొద్ది వారాల్లో డీల్ ప్రకటించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన జియో వంటి దేశీ దిగ్గజాలు కూడా జీల్‌పై దృష్టి సారిస్తున్నాయి.
మీడియాలో రిలయన్స్ హవా..
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఇప్పటికే పలు మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థల్లో ఇన్వెస్ట్ చేశారు. నెట్‌వర్క్18లో 75 శాతం వాటాలు కొనుగోలు చేశారు. న్యూస్‌కి సంబంధించి సీఎన్‌ఎన్–న్యూస్18, సీఎన్‌బీసీ–టీవీ18, ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించి వయాకామ్ 18తో పాటు సినిమాల నిర్మాణ సంస్థ వయాకామ్18 మోషన్ పిక్చర్స్ వంటివి ఇందులో భాగమే. వీటితో పాటు హిందీ, ఇంగ్లీష్ సహా పలు భారతీయ భాషల్లో డిజిటల్, పబ్లిషింగ్ సంస్థలూ ఇందులో ఉన్నాయి. రామోజీరావుకు చెందిన ఈటీవీ వివిధ భాషల్లో ఆరంభించిన న్యూస్ ఛానెళ్లు కూడా ప్రస్తుతం నెట్‌వర్క్–18 చేతిలోనే ఉన్నాయి. 2017 జూలైలో కంటెంట్ ప్రొడక్షన్ సంస్థ బాలాజీ టెలీఫిలిమ్స్‌లో రిలయన్స్ 24.9 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ సంస్థకి ఆల్ట్‌బాలాజీ పేరుతో ఓవర్–ది–టాప్ (ఓటీటీ) యాప్ కూడా ఉంది. ఇక ఇప్పుడు జీల్‌లో కూడా వాటాలు కొనుగోలు చేస్తే ఓటీటీ, బ్రాడ్‌కాస్టింగ్ విభాగంలో రిలయన్స్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే అవకాశాలు ఉన్నాయని, దేశీయ నెట్‌ఫ్లిక్స్‌గా ఎదిగేందుకు రిలయన్స్ చేస్తున్న ప్రయత్నాలకు మరింత దన్ను లభిస్తుందని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి.
సుభాష్ చంద్రకు దక్కేదెంత..
ప్రస్తుతం జీల్‌లో సుభాష్ చంద్ర, ఆయన కుటుంబానికి 41 శాతం వాటాలుండగా.. ఇందులో 20 శాతం వాటాలను విక్రయించాలని భావిస్తున్నారు. వాటాల విక్రయ వార్తలతో డిసెంబర్‌లో జీల్ షేరు రూ.500 స్థాయికి ఎగియడంతో వీటి విలువ రూ.10,000 కోట్లకు ఎగిసింది. అయితే, శుక్రవారం ప్రతికూల వార్తలతో జీల్ షేరు ఏకంగా 26 శాతం పతనం కావడంతో ఆ రోజు లెక్కల ప్రకారం 20 శాతం వాటాలకు గాను సుభాష్ చంద్రకు రూ. 7,000 కోట్లు మాత్రమే దక్కే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఇది డిసెంబర్ నాటి విలువతో పోలిస్తే 30 శాతం తక్కువ. అయితే, సోమవారం షేరు కోలుకోవడంతో విలువ మళ్లీ కొంత మేర పెరిగిందని, రూ.8వేల కోట్ల దరిదాపుల్లో ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఎస్సెల్‌కు బ్యాంకర్ల భరోసా.. షేరు 17 శాతం జూమ్..
రుణాల చెల్లింపు అంశానికి సంబంధించి జీల్ మాతృసంస్థ ఎస్సెల్ గ్రూప్, బ్యాంకర్లకు మధ్య ఒప్పందం కుదరడంతో సోమవారం సంస్థ షేరు ఎగిసింది. ఒప్పందం ప్రకారం.. తనఖాలోని ప్రమోటర్ల షేర్లను మూడు నెలల దాకా విక్రయించబోమని, ధర తగ్గినా దీనికి కట్టుబడి ఉంటామని బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు భరోసా ఇచ్చాయి. ఈలోగా జీల్‌లో వాటాలతో పాటు ఇన్‌ఫ్రా అసెట్స్ మొదలైన వాటిని విక్రయించడం ద్వారా ఎస్సెల్ గ్రూప్ దశలవారీగా రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. శుక్రవారం నాటి గణాంకాల ప్రకారం.. జీల్ మార్కెట్ విలువ రూ. 30,673 కోట్లుగా ఉండగా.. రూ.7,580 కోట్ల విలువ చేసే షేర్లు తనఖాలో ఉన్నాయి. మరోవైపు, డీమోనిటైజేషన్ అనంతరం గ్రూప్ సంస్థల సందేహాస్పద డిపాజిట్లపై విచారణ జరుగుతోందన్న వార్తలను కంపెనీ ఖండించింది. ఈ సానుకూల అంశాలతో సోమవారం జీల్ షేరు ఏకంగా 17 శాతం ఎగిసి రూ. 372.50 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో ఒక దశలో 19 శాతం కూడా పెరిగి రూ. 380.80 స్థాయిని తాకింది. ప్రతికూల వార్తల మధ్య జీల్ షేరు శుక్రవారం ఏకంగా 26 శాతం పతనమైన సంగతి తెలిసిందే.
ఓటీటీ రంగం..రూ.35 వేల కోట్లకు!
ఇంటర్నెట్ ద్వారా జరిగే మీడియా కంటెంట్ ప్రసారాన్ని ఓటీటీగా వ్యవహరిస్తారు. 2018లో దేశీ ఓటీటీ మార్కెట్ రూ.3,500 కోట్లుగా ఉండగా.. 2023 నాటికి ఇది పది రెట్ల వృద్ధితో రూ. 35,000 కోట్ల స్థాయికి చేరుతుందనే అంచనాలున్నాయి. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్లో 40 శాతం వాటాతో హాట్‌స్టార్ అగ్రస్థానంలో ఉండగా, జియో టీవీ 18% వాటాతో రెండో స్థానంలో ఉంది. జీ గ్రూప్‌నకు చెందిన జీ5కి 15%, వూట్ (వయాకామ్18)కి 12 శాతం, అమెజాన్ ప్రైమ్ వీడియోకి 1.43 శాతం, నెట్‌ఫ్లిక్స్‌కు 2 శాతం మార్కెట్ వాటా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment