
భీమ్ యాప్ తెలుగులో..
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులకు ఉపయోగపడే భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ (భీమ్) యాప్‌నకు సంబంధించి అప్‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేసినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) వెల్లడించింది. అప్‌డేటెడ్ వెర్షన్ 1.2లో కొత్తగా తెలుగు, తమిళం, కన్నడం సహా ఏడు ప్రాంతీయ భాషలు కూడా చేర్చినట్లు పేర్కొంది.
ఇప్పటిదాకా ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే ఇది లభిస్తోంది. డిసెంబర్ 30న ప్రవేశపెట్టినప్పట్నుంచీ భీమ్ యాప్‌నకు ఇది రెండో అప్‌డేట్. లబ్ధిదారు బ్యాంక్ ఖాతాతో అనుసంధానించిన ఆధార్ నంబరుకు నగదు బదిలీ చేసే విధంగా పే టు ఆధార్ నంబర్ ఫీచర్‌ను ఇందులో చేరుస్తున్నట్లు ఎన్‌పీసీఐ పేర్కొంది.
డిజిటల్ చెల్లింపుల నిబంధనలపై కసరత్తు
వినియోగదారుల వివరాల భద్రతకు ప్రాధాన్యమిస్తూ.. డిజిటల్ చెల్లింపు లావాదేవీలను సురక్షితం చేసే దిశగా మార్గదర్శకాల రూపకల్పనపై కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియలో వర్తకులనూ భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులకు సంబంధించి నిర్దిష్ట మార్గదర్శకాలు గానీ నియంత్రణ వ్యవస్థ గానీ లేదు. పెద్ద నోట్ల రద్దుతో డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెర గడంతో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది.