ముందుగా వెల్లడిస్తే ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ
నల్లధనంపై ప్రభుత్వం ఆఫర్
న్యూఢిల్లీ: ప్రత్యేక పథకాన్ని ఉపయోగించుకుని విదేశీ అక్రమ ఆస్తులను ముందస్తుగా వెల్లడించిన వారికి ఫెమా సహా ఐదు చట్టాల కింద ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ లభించగలదని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఇలాంటి వారికి అదాయ పన్ను చట్టం, సంపద చట్టం, విదేశీ మారక నిర్వహణ చట్టం, కంపెనీల చట్టం, కస్టమ్స్ చట్టం కింద ప్రాసిక్యూషన్ ఉండదని పేర్కొంది. అయితే, ఈ ఐదు మినహా.. ఇతరత్రా చట్టాలేమైనా వర్తించే పక్షంలో చర్యలు తప్పవని స్పష్టం చేసింది. అవినీతి ద్వారా సొమ్ము కూడబెట్టిన వారికి, జూన్ 30కి ముందుగానే నోటీసులు అందుకున్న వారికి మినహాయింపులు వర్తించబోవని పేర్కొంది.
నల్లధన కుబేరులు విదేశీ ఆస్తుల వివరాలను స్వచ్ఛందంగా వెల్లడించేందుకు ఉద్దేశించిన వన్ టైమ్ కాంప్లియన్స్ విండో సదుపాయంపై సందేహాలను నివృత్తి చేసే దిశగా కేంద్రం ఈ విషయాలు తెలిపింది. విదేశాల్లో అక్రమంగా కలిగి ఉన్న బ్యాంకు ఖాతా విలువను.. అది ప్రారంభించినప్పటి నుంచి జమ అవుతూ వచ్చిన డిపాజిట్ల మొత్తం ఆధారంగా లెక్కించి.. పన్నులు, జరిమానాలు విధించడం జరుగుతుందని పేర్కొంది.
ఒకవేళ భారత్‌లో ఆర్జించిన ఆదాయంపై ఇక్కడ పన్ను చెల్లించకుండా, విదేశాల్లో ఆస్తి కొన్న పక్షంలో దాన్ని కూడా చట్టప్రకారం వెల్లడించని విదేశీ ఆస్తిగానే పరిగణించడం జరుగుతుందని తెలిపింది. ఇక, విద్యార్థులకు ఊరటనిచ్చే విధంగా.. క్రితం సంవత్సరంలో రూ. 5 లక్షల కన్నా తక్కువగా డిపాజిట్లు ఉన్న విదేశీ బ్యాంకు ఖాతాల విషయంలో ఎటువంటి పెనాల్టీలూ ఉండబోవని పేర్కొంది.