ఆభరణాలపై ఎక్సైజ్ సుంకం..తొలగించేది లేదు
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: వెండి యేతర ఆభరణాలపై ఒకశాతం ఎక్సైజ్ సుంకం తొలగించే ప్రశ్నేలేదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ గురువారం రాజ్యసభలో స్పష్టం చేశారు. విలాసవంతమైన వస్తువులను పన్ను పరిధి నుంచి తొలగించడం సరికాదన్నది ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఆర్థికమంత్రి ఇచ్చిన సమాధానంతో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు ప్రతిపక్ష సభ్యులు ఈ అంశంపై మాట్లాడుతూ, ఆభరణాలపై సుంకం విధింపు ఈ రంగంలో వ్యాపారాన్ని నిర్వీర్యం చేయడమేనని విమర్శించారు. 40 రోజుల నుంచీ వర్తకులు సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు.
అయితే ఈ విమర్శలను ఆర్థికమంత్రి తోసిపుచ్చారు. సామాన్య వ్యక్తి వినియోగించే సబ్బులు, టూత్ పేస్ట్‌లు, రేజర్,పెన్సిల్, ఇంక్, ఫ్రూట్ జ్యూస్, బేబీ ఫుడ్ వంటి నిత్యావసర వస్తువులమీదే పన్ను విధిస్తున్నప్పుడు... లగ్జరీ వస్తువులను పన్ను పరిధి నుంచి తప్పించాలని భావించడం సరికాదని పేర్కొన్నారు. ఇమిటేషన్ ఆభరణాలమీదే 6 శాతం పన్ను విధిస్తున్న అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
వేధింపులుగా భావించకూడదు...
పన్ను విధింపు స్వర్ణకారులు, వర్తకులను వేధించడంగా భావించడం తగదని జైట్లీ అన్నారు. గత ఆర్థిక సంవత్సరం రూ.12 కోట్ల పైన టర్నోవర్‌ను పన్ను పరిధిలోకి తీసుకోవడం జరిగిందని, ఈ యేడాది దీనిని రూ. 6 కోట్లకు ప్రభుత్వం తగ్గిస్తోందని పేర్కొన్న జైట్లీ... చిన్న, మధ్య వర్తకులు, స్వర్ణకారులపై పన్ను ప్రభావం ఏమాత్రం ఉండదన్న విషయాన్ని ఇక్కడ గమనించాలని కోరారు.