![జువెలర్స్ కు పన్నుపై వెనక్కితగ్గని కేంద్రం - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/71458068040_625x300.jpg.webp?itok=oY-VvBvW)
జువెలర్స్ కు పన్నుపై వెనక్కితగ్గని కేంద్రం
♦ పన్ను చెల్లింపునకు సరళ ప్రక్రియే ఉంటుందని వెల్లడి
♦ 14వ రోజుకు చేరిన సమ్మె
సాక్షి, హైదరాబాద్: జువెలరీ వర్తకులపై 1 శాతం ఎక్సైజ్ సుంకం విధింపు ప్రతిపాదనను ఉపసంహరించుకునే ప్రసక్తేలేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్రం దీనికి సంబంధించి కొంత వివరణ ఇచ్చింది. పన్ను చెల్లింపునకు ప్రత్యేక విధానమేమీ ఉండదని... ప్రక్రియ మొత్తం చాలా సరళంగా ఉంటుందని కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ చీఫ్ కమిషనర్ కార్యాలయం, హైదరాబాద్ కమిషనర్-1 ఎం. శ్రీనివాస్, కమిషనర్-2 సునీల్‌జైన్ పేర్కొన్నారు. దీనిపై సరైన సమాచారం లేకపోవడంవల్లే జువెలర్లు ఆందోళన చెందుతున్నారని మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరణ ఇచ్చారు. రెండు రోజుల్లోనే జువెలర్లు రిజిస్టర్ చేసుకోవచ్చని. ఆన్‌లైన్‌లో పన్నును చెల్లించవచ్చని, రిటర్న్ ఫైల్ చేయొచ్చని వివరించారు.
మరోపక్క, కేంద్రం వెనక్కితగ్గకపోవడంతో ఆభరణాల విక్రేతలు సమ్మెను కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా సమ్మె మంగళవారం 14వ రోజుకు చేరింది. కేవలం గడిచిన ఏడాదిలో రూ.12 కోట్లకు మించి టర్నోవర్‌ను నమోదుచేసిన ఆభరణాల తయారీదారులు మాత్రమే ఈ 1% ఎక్సైజ్ సుంకాన్ని చెల్లించాల్సి వస్తుందని... అందరికీ వర్తించదని కమిషనర్లు పేర్కొన్నారు. వెండి ఆభరణాలపై పన్ను ఉండదని కూడా తేల్చిచెప్పారు. మరోపక్క, కేవలం జాబ్ వర్క్ ఆధారంగా ఆభరణాలను తయారు చేసే నగల తయారీదారులు సెంట్రల్ ఎక్సైజ్ విభాగం వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. స్వీయ మదింపు ఆధారంగా స్వచ్ఛందంగా జువెలర్లు ఈ పన్నును చెల్లించే విధంగా విధానం ఉంటుందని వెల్లడించారు. వర్తకులకు ఉన్న సందేహాలు తీర్చేందుకు వారితో త్వరలో ఓపెన్‌హౌస్ డిబేట్(చర్చాగోష్టి)ను ఏర్పాటు చేస్తామని వివరించారు.
ఒక శాతం ఎక్సైజ్ సుంకం విధింపుతో పాటు రూ. 2 లక్షల విలువైన కొనుగోళ్లకు కస్టమర్ల పాన్ నంబర్‌ను తప్పనిసరి చేయడాన్ని జువెలర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ‘పాన్’ తప్పనిసరి చేసిననాటినుంచి ఆభరణాల విక్రయ వ్యాపారం 20 శాతం మేర పడిపోయిందని ఆలిండియా సరాఫా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సురిందర్ కుమార్ జైన్ చెప్పారు. మరోపక్క, జువెలర్లకు మద్దతుగా ఢిల్లీలో ఈ నెల 17న బంద్ చేయనున్నట్లు కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) ఒక ప్రకటనలో పేర్కొంది.