ఆన్‌లైన్ హైరింగ్ జోరు
కొత్త ప్రభుత్వంతో కొత్త కొలువులు : మాన్‌స్టర్‌డాట్‌కామ్ వెల్లడి
న్యూఢిల్లీ: భారత్‌లో ఆన్‌లైన్ హైరింగ్ జోరు ఎప్పటికప్పుడు పెరుగుతోంది. ఈ ఏడాది మేలో ఈ ఆన్‌లైన్ హైరింగ్ 19 శాతం వృద్ధి చెందిందని ప్రముఖ జాబ్ పోర్టల్ మాన్‌స్టర్‌డాట్‌కామ్ సర్వేలో తేలింది. గత ఏడాది ఫిబ్రవరి నుంచి చూస్తే ఇదే అత్యంత అధిక వృద్ధిరేటని వివరించింది. కొత్త ప్రభుత్వం కారణంగా ఆర్థిక వృద్ధి జోరు పెరుగుతుందని, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం నెలకొంటోందని, ఫలితంగా భారీ సంఖ్యలో కొత్త కొలువులు వస్తాయని మాన్‌స్టర్‌డాట్‌కామ్ ఎండీ సంజయ్ మోడి చెప్పారు.
ఈ సర్వే వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు...,
* ఈ ఏడాది ప్రారంభం నుంచే ఆన్‌లైన్ హైరింగ్ కార్యకలాపాలు నిలకడగా పెరుగుతున్నాయి.
* గత ఏడాది మేలో 127 పాయింట్లుగా ఉన్న ద మాన్‌స్టర్‌డాట్‌కామ్ ఎంప్లాయ్‌మెంట్ ఇండెక్స్ 19 శాతం (24 పాయింట్లు) వృద్ధితో ఈ ఏడాది 151 పాయింట్లకు పెరిగింది. ఏప్రిల్‌లో కూడా ఇదే స్థాయి వృద్ధిని సాధించింది.
* 27 పారిశ్రామిక రంగాల్లో 16 రంగాల్లో ఉద్యోగ నియామక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. హైరింగ్ విషయంలో మీడియా, ఎంటర్‌టైన్మెంట్ రంగం అత్యధిక వృద్ధిని (59 శాతం) సాధించింది.
* ఇక సీనియర్ మేనేజ్‌మెంట్ ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరిగింది.
* ఏడాది కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే 13 నగరాల్లో ఆన్‌లైన్ హైరింగ్ పెరిగింది. 37 శాతం వృద్ధితో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ముంబై(27% వృద్ధి), ఢిల్లీ-ఎన్‌సీఆర్(20 %), హైదరాబాద్(19%), చెన్నై(17%) ఉన్నాయి.