న్యూఢిల్లీ: బ్యాండ్‌విడ్త్ కోసం బెగ్గింగ్ చేసే రోజులు పోయాయిప్పుడు. ఒక వీడియోను డౌన్‌లోడ్ చేసుకుంటే డేటా ఖర్చయిపోతుందేమోననే భయాలు కూడా లేవిప్పుడు. అందుకే... పెన్‌డ్రైవ్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని దాన్నే అలా చేతులు మార్చుకునే రోజులిప్పుడు లేవు. డౌన్‌లోడ్ చేసుకుంటే స్పేస్ వృథా అవుతుందన్న కారణంతో అంతా తమ సొంత టీవీల్లోనో, మొబైల్‌లోనో వీడియోలను లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇదిగో... ఈ ధోరణి ఎంటర్‌టైన్‌మెంట్ రంగ రూపురేఖల్ని మార్చేస్తోంది. డిజిటల్ ఓవర్ ది టాప్ (ఓటీటీ) ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల టీవీ చానళ్లకు సంబంధించి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిబంధనలు అమల్లోకి వచ్చాక ఓటీటీ వేగం మరింత పెరిగింది.
పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ– ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) సర్వే ప్రకారం మీడియా– వినోద రంగానికి సంబంధించి 2019లో తొలిసారిగా సినిమాను డిజిటల్ విభాగం అధిగమించనుంది. 2021 నాటికి ప్రింట్‌ను కూడా దాటేసి రూ.35,400 కోట్ల స్థాయికి చేరనుంది. ఈ విభాగంలో ఇంత భారీ స్థాయిలో అవకాశాలుండటంతో ఓటీటీ సంస్థలు కొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా 30 పైచిలుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇవి సినిమాలు, చానల్స్ ప్రసారంతో పాటు సొంతంగా సీరియళ్లు, సినిమాల్లాంటి కంటెంట్‌ను కూడా రూపొందిస్తూ వీక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. గతేడాది ఏకంగా 1,200 గంటల నిడివి ఉండే తాజా కంటెంట్‌ను ఓటీటీ సంస్థలు నిర్మించాయి. హాట్‌స్టార్, ఈరోస్ నౌ, సోనీ లైవ్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హంగామా, వూట్, ఆల్ట్‌బాలాజీ, జీ5, సన్‌నెక్ట్స్ తదితర సంస్థలు ఓటీటీ విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. దేశీ సంస్థలు అంతర్జాతీయంగానూ విస్తరిస్తున్నాయి. ఈరోస్ డిజిటల్ తాజాగా చైనా సంస్థతో జట్టు కట్టి భారత్, చైనాలో ఒక ప్రోగ్రామ్‌ను చిత్రీకరిస్తోంది. బ్రిటన్ లాంటి దేశాల్లో కూడా కో–మార్కెటింగ్ డీల్స్ కుదుర్చుకుంది.
చౌకగా చార్జీలు..
ఓటీటీ సంస్థలు వీలైనంత చౌకగా కంటెంట్‌ను ఆఫర్ చేసేందుకు పోటీపడుతున్నాయి. ఉదాహరణకు హాట్‌స్టార్ అన్ని స్పోర్ట్స్, అమెరికన్ షోస్, సినిమాలకు వార్షికంగా రూ.999 చార్జీలు వసూలు చేస్తోంది. రూ.299కి నెలవారీ ప్యాకేజీ కూడా అందిస్తోంది. టీవీల్లో ప్రసారం కాకముందే స్పెషల్స్, సీరియల్స్ మొదలైనవి చూడాలనుకునేవారి కోసం హాట్‌స్టార్ వీఐపీ పేరుతో వార్షికంగా రూ.365 చార్జీలకు అందిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ చార్జీలు నెలకు రూ.500–800 స్థాయిలో ఉంటున్నాయి. అటు అమెజాన్ ప్రైమ్ వీడియో చార్జీలు నెలకు రూ.129, ఏడాదికి రూ.999 స్థాయిలో ఉన్నాయి. నెలవారీగానే కాక వారం వ్యవధికి పనిచేసే చిన్న ప్యాక్‌లనూ ఓటీటీ సంస్థలు అందుబాటులోకి తెచ్చాయి. సోనీలైవ్ 7 రోజులకు రూ.29 ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. ఐపీఎల్ క్రికెట్ సీజన్ నేపథ్యంలో హాట్‌స్టార్ కూడా కేవలం రూ.25 నెలవారీ చార్జీలతో స్పోర్ట్స్ ప్యాకేజీని అందిస్తోంది. జీ5 సైతం ఇదే కోవలో చౌక ప్యాకేజీలను ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉంది. సాధారణంగా బడ్జెట్ ప్యాక్‌లకు వ్యతిరేకంగా ఉండే నెట్‌ఫ్లిక్స్ కూడా భారత యూజర్లకు చౌక ప్యాక్‌లపై దృష్టి పెడుతోంది. వారానికి రూ.65కే సర్వీసులు అందించే ప్యాక్‌ను పరిశీలిస్తోంది.
భారీ పెట్టుబడులు..
ఓటీటీ సంస్థలు భారీ స్థాయిలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఈరోస్ నౌ సంస్థ దగ్గర ఇప్పటికే 12,000 పైచిలుకు సినిమాలున్నాయి. కొత్తగా మరింత కంటెంట్ కొనుగోలు, నిర్మాణం కోసం వచ్చే ఏడాదిన్నర వ్యవధిలో 50–70 మిలియన్ డాలర్లు వెచ్చించబోతోంది. స్టార్ యూఎస్ హోల్డింగ్స్‌తో కలిసి స్టార్ ఇండియా తమ ఓటీటీ విభాగం హాట్‌స్టార్‌లో దాదాపు రూ.1,066 కోట్ల (153 మిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేస్తోంది. గతేడాది పెట్టిన రూ.516 కోట్ల పెట్టుబడులకు ఇది అదనం. ఇతర సంస్థలూ ఇదే స్థాయిలో పెట్టుబడులకు సిద్ధమవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా ఎనిమిది కొత్త సినిమాలు, 12 వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్నట్లు వెల్లడించింది. సేక్రెడ్ గేమ్స్ లాంటి బ్లాక్‌బస్టర్ సిరీస్ తరహాలోనే ఇవి కూడా హిట్ అవుతాయని ఆశిస్తోంది. దేశీ సంస్థ ఆల్ట్‌బాలాజీ కూడా 2019లో 30–40 షోలు నిర్మిస్తున్నట్లు తెలిపింది.
‘ప్రాంతీయ’ కంటెంట్‌పై దృష్టి..
సాధారణంగా యువ జనాభాలో ఎక్కువ శాతం వీక్షకులు బస్సులు, రైళ్లు, ట్యాక్సీల్లో ప్రయాణించేటప్పుడో లేదా లంచ్ బ్రేక్‌లోనూ చూసేందుకు అనువైన 10–15 నిమిషాల తక్కువ నిడివి ఉండే కంటెంట్‌ను ఇష్టపడుతున్నారని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోస్ నౌ లాంటి సంస్థలు ఇలాంటి కంటెంట్‌పై దృష్టిపెడుతున్నాయి. ఇక చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచీ వీక్షకుల సంఖ్య
భారీగా పెరుగుతోందని ఓటీటీ సంస్థలు గుర్తించాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వీక్షకులకు మరింత చేరువయ్యే మార్గాలపై దృష్టి పెడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రాంతీయ భాషల్లోనూ కంటెంట్‌ను అందిస్తున్నాయి. వయాకామ్18కి చెందిన వూట్ సంస్థ తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ తదితర భాషల్లో కంటెంట్ రూపొందిస్తోంది. అమెజాన్ ప్రైమ్ కూడా తెలుగు సహా తమిళం, హిందీ, మరాఠీ, బెంగాలీ, కన్నడ వంటి భాషల్లో ప్రోగ్రామ్స్ చేస్తోంది.
ఓటీటీ జోరు ఇదీ...!
► 2018లో 32.5 కోట్ల మంది ఆన్‌లైన్ వీడియోలు వీక్షించారు. ఇది అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 25 శాతం అధికం.
► వచ్చే మూడేళ్లలో డిజిటల్ వీడియో వినియోగదారుల సంఖ్య 50–60 కోట్లకు చేరగలదన్న అంచనాలు నెలకొన్నాయి.
► 2017లో 70 లక్షలుగా ఉన్న సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 2018 నాటికి 1.2–1.5 కోట్లకు పెరిగారు.
► దేశీయంగా 34 కోట్లకు పైగా స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఉండగా, డేటా వినియోగం గతేడాది రెట్టింపయ్యింది.
వినోదంలో యాప్‌లే ‘టాప్’
Published Sat, Apr 20 2019 4:51 AM | Last Updated on Sat, Apr 20 2019 4:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment