రెండేళ్ల నుంచి చాలా మందిలో ఒకటే సందేహం. హైదరాబాద్‌లో స్థిరాస్తి కొనాలా.. వద్దా? కొంటే ఏమవుతుందనే అందోళన! సొంతింటికి ఇది సరైన సమయం కాదేమోనన్న అనుమానం!! బిల్డర్లు డబ్బుల్లేక గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తారో లేదోననే భయం!!! కానీ, నేడీ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. బెంగళూరు, అహ్మదాబాద్, పుణే నగరాలకు చెందిన పలు నిర్మాణ సంస్థలు నగరంలో పలు ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టాయి. దీంతో నగర బిల్డర్లలోనూ ఉత్సాహం నెలకొంది. మరోవైపు భవిష్యత్తులో రేట్లు పెరిగే అవకాశమున్నందున ఇప్పుడు కొనటమే మంచిదనే నిర్ణయానికి కొనుగోలుదారులూ వస్తున్నారంటున్నారు నిపుణులు.
- సాక్షి, హైదరాబాద్
భాగ్యనగరాన్ని విశ్వనగరంగా మార్చే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయటం, పలు పరిశ్రమలూ పెట్టుబడులతో ముందుకు రావటం హైదరాబాద్ భవిష్యత్తుకు ఢోకా ఉండదన్న సంకేతాలు లభించడంతో స్థిరాస్తి రంగంలో సానుకూల వాతావరణం నెలకొంది. పెపైచ్చు గతంలో ప్రారంభించిన నిర్మాణాలు చివరి దశలోకి రావటం, కొన్ని గృహప్రవేశానికి సిద్ధం కావటం, ఇతర నగరాలకు చెందిన నిర్మాణ సంస్థలు సరికొత్త ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టడం మరింత కలిసొస్తున్నాయి.
మదుపరులు వెనక్కి..
కొంతకాలంగా బెంగళూరు, ఆంధ్రప్రదేశ్‌లకు వెళ్లిన పెట్టుబడులు ఇప్పుడు యూ టర్న్‌ను తీసుకున్నాయంటున్నారు ట్రాన్‌కాన్ లైఫ్‌స్పేసెస్ ప్రై.లి. శ్రీధర్ రెడ్డి. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమ వృద్ధి లేదు. ఉద్యోగావకాశాలూ తక్కువే. కొత్త పరిశ్రమలు ఫౌండేషన్‌లు వేస్తున్నాయి తప్ప.. నిర్మాణ పనుల్ని చేయట్లేదని’’ చెప్పారు. మరోవైపు బెంగళూరులో స్థిరాస్తి ధరలు ఆకాశాన్ని దాటేశాయి. ఇక్కడ 70 శాతం మంది ఐటీ నిపుణులు తెలుగువారే.
బెంగళూరులో చ.అ. రూ.8 వేలు, గుంటూరు టౌన్‌లో చ.అ. 4 వేలుంటే.. నేటికీ ఉప్పల్‌లో 2,400లు, గచ్చిబౌలిలోని కొన్ని ప్రాంతాల్లో రూ.3,400లకూ దొరికే ప్రాజెక్ట్‌లూ ఉన్నాయనే విషయం వారికి తెలుసు. దీంతో అక్కడ వెచ్చించే సొమ్ములో సగంతోనే హైదరాబాద్‌లో ప్రీమియం ఫ్లాట్లనే దక్కించుకుంటున్నారు. ‘గతేడాది ఏప్రిల్‌లో మా ప్రాజెక్ట్‌లో నలుగురు వాకిన్స్ చేస్తే.. ఇప్పుడది 60కి చేరింది అన్నారాయన. ఇది చాలు పెట్టుబడులు నగరానికి తిరిగొస్తున్నాయని చెప్పేందుకు. పెపైచ్చు హైదరాబాద్ భౌగోళికంగానూ సేఫ్, రాజకీయ అస్థిరత సర్దుమణిగింది కూడా. ఇక అభివృద్ధికి బాటలు వేస్తోంది ప్రభుత్వం.
ధరలు తక్కువే..
బెంగళూరు, పుణే, చెన్నై వంటి నగరాలతో పోల్చితే.. హైదరాబాద్‌లో ప్రస్తుతం ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. రెండేళ్ల క్రితం కంటే ధరలు తగ్గడంతో ఐటీ నిపుణులు పెట్టుబడి దృష్టితో కాకుండా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఇళ్లను కొంటున్నారు. సిమెంటు, ఉక్కు వంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరిగే అవకాశమున్నందున ఫ్లాట్ల ధరలూ పెరగొచ్చు. కాబట్టి ఇల్లు కొనుక్కోవడానికి ఇదే మంచి సమయం.
ఐటీ, ఐటీఈఎస్ బెంగళూరు, పుణే వంటి ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసినా.. హైదరాబాద్ ఇళ్లకు మంచి అద్దె లభిస్తుందనే ధీమా వీరిలో నెలకొంది. అయితే కొత్త వాటిలో కాకుండా ఏడాదిలోపు పూర్తయ్యే వాటికి ప్రాధాన్యమిస్తున్నారు. రెండేళ్ల క్రితం నిర్మాణంలో ఉన్న ఫ్లాటును కొనాలంటే సందేహించాల్సిన పరిస్థితి. అప్పుడే ఆరంభమైన వాటిలో కొనడానికి ధైర్యం చాలట్లేదంటున్నారు కస్టమర్లు.
ఇతర నగరాల ప్రాజెక్ట్‌లు..
మార్కెట్‌తో సంబంధం లేకుండా ఉప్పల్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో చేపట్టే నిర్మాణాలకు గిరాకీ ఎప్పుడూ ఉంటుంది. ప్రెస్టిజ్ గ్రూప్ కొండాపూర్‌లో 4.96 ఎకరాల్లో 349 ఫ్లాట్లను, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 21.85 ఎకరాల్లో 2,240 ఫ్లాట్లు గల పలు ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టింది. పూర్వాంకర గ్రూప్ కొండాపూర్‌లో పూర్వ సమ్మిట్ పేరుతో గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ ప్రాజెక్ట్‌నూ నిర్మించనుంది. గనార్సింగిలో ఆక్యురేట్ డెవలపర్స్ 6.5 ఎకరాల్లో 722 ఫ్లాట్ల ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. పసిఫికా సంస్థ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో హిల్‌క్రెస్ట్ ప్రాజెక్ట్‌ను ఆరంభించడానికి సన్నాహాలు చేస్తోంది.
రియల్ పట్టాలపైకి!
Published Sat, May 2 2015 12:42 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement
Advertisement