ఫైల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా, లాక్‌డౌన్ సమయంలో వ్యాపారాలు లేక, ఆదాయాలు క్షీణించి పలు కంపెనీలు ఇబ్బందుల్లో పడిపోతే ప్రముఖ బిస్కెట్ తయారీ సంస్థ పార్లే జీ మాత్రం గణనీయమైన వృద్ధిని తన ఖాతాలో వేసుకుంది. లాక్‌డౌన్ మూడు నెలల సమయంలో దేశంలో పార్లే-జి బిస్కెట్ల అమ్మకాలు రికార్డు సృష్టించాయి.
1938లో ఈ కంపెనీ స్థాపించిన నాటి నుంచి లేనంతగా ఈ మూడు నెలల స్థాయిలో గణనీయమైన అమ్మకాలను నమోదు చేసింది. మాతృ సంస్థ, పార్లే ప్రొడక్ట్స్ ఈ నిర్దిష్ట గణాంకాలను వివరించడానికి నిరాకరించి నప్పటికీ, మార్చి- మే నెల మధ్య కాలంలో భారీ అమ్మకాలు జరిగాయని పేర్కొంది. దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు పార్లే జీ బిస్కెట్లను పెద్ద మొత్తాల్లో కొని పంపిణీ చేశాయని దీంతో రికార్డు స్థాయిలో సాగాయని కంపెనీ వెల్లడించింది. దేశంలోని 120 ఫ్యాక్టరీల్లో మార్చి 25వ తేదీనుంచే బిస్కెట్ల ఉత్పత్తి ప్రారంభించామని తెలిపింది. కిలో వందరూపాయల లోపు ధరలోనే పార్లే -జి బిస్కెట్లు లభిస్తున్నందున వీటికి మార్కెట్ లో డిమాండు బాగా పెరిగిందని కంపెనీ వివరించింది. (పెట్రో షాక్ : నాలుగో రోజూ)
మొత్తం విక్రయాల్లో ఇవి 50 శాతానికి పై మాటేనని, మొత్తం ఆదాయంలో మూడింట ఒక వంతు ఆదాయాన్ని ఆర్జించిందని కంపెనీ సీనియర్ ప్రతినిధి మయాంక్ షా తెలిపారు. ఒక్క పార్లే జీ మాత్రమే కాకుండా తమ ఇతర బిస్కట్ ఉత్పత్తులకు కూడా డిమాండ్ ఊపందుకుందన్నారు. దీంతో మిగతా అన్ని బిస్కెట్ కంపెనీలతో పోలిస్తే అత్యధిక వృద్ధి రేటు సాధించామన్నారు. అలాగే సునామీ భూకంపాలు వంటి ఇతర సంక్షోభాల సమయంలో కూడా పార్లే-జి బిస్కెట్ల అమ్మకాలు పెరిగాయన్నారు. ఈ అసాధారణమైన అమ్మకాలతో పార్లే మార్కెట్ వాటా 4.5 నుండి 5 శాతానికి పెరిగిందన్నారు. గత 30-40 సంవత్సరాలలో, ఈ ఇంతటి వృధ్దిని చూడలేదన్నారు. బ్రాండ్‌పై ప్రజలకున్న నమ్మకానికి తోడు పార్లే జీ బిస్కట్లు ఎక్కువ కాలం నిల్వ ఉండటం ఇంతటి ప్రాధాన్యతకు కారణమని ఆయన వ్యాఖ్యానించారు. కాగా భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో మూడు కోట్ల పార్లేజీ బిస్కెట్లను విరాళంగా ఇస్తున్నట్లు కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. (మాల్యా అప్పగింత : మరో ఎత్తుగడ)
Comments
Please login to add a commentAdd a comment