
న్యూఢిల్లీ: పతంజలి బ్రాండ్ వచ్చే ఐదేళ్ల కాలంలో రూ.2 లక్షల కోట్ల విలువకు ఎదుగుతుందని ఆ సంస్థ అధినేత రామ్‌దేవ్ బాబా అన్నారు. కొత్త విభాగాల్లోకి కంపెనీ ప్రవేశించనుందని, సమీకృత ఆహార పార్కులు, తయారీ కేంద్రాలు వీటిలో ఉన్నాయని చెప్పారు. రానున్న రెండేళ్లలో రూ.లక్ష కోట్ల విలువ తయారీ సామర్థ్యాలు కంపెనీకి ఉంటాయన్నారు.
ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను విస్తరించడం ద్వారా ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వ్యాపార లక్ష్యాన్ని సాధించాలని కంపెనీ అనుకుంటోంది. మార్కెట్ సైజు రూ.10 లక్షల కోట్లకు పైగా ఉన్న పలు విభాగాల్లో ప్రవేశానికి సన్నాహాలు జరుగుతున్నాయని, వీటిలో రానున్న మూడు నుంచి ఐదేళ్లలో 10–20 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంటామని పేర్కొన్నారు. 2016–17లో పతంజలి టర్నోవర్ రూ.10,561 కోట్లుగా ఉంది. డెనిమ్, తాగునీరు, సెక్యూరిటీ సేవల్లోకి అడుగు పెడుతోంది.