
6 లోగా... 600 కోట్లు కట్టాల్సిందే!
• గడువు పెంచం; కట్టకుంటే మళ్లీ జైలుకు
• సహారాకు సుప్రీం కోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతోరాయ్ మళ్లీ తీవ్ర ఇబ్బందుల్లో పడుతున్నట్లు కనిపిస్తోంది. పెరోల్ పొడిగింపునకు చెల్లించాల్సిన రూ.600 కోట్లను ఫిబ్రవరి 6వ తేదీలోగా చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గడువును ఎంతమాత్రం పొడిగించేది లేదంటూ... డిపాజిట్ చేయలేకపోతే జైలుకు వెళ్లక తప్పదని పేర్కొంది.
ఇప్పటికే ఎక్కువ ఉదారత...: ‘‘ఇప్పటికే ఇతర లిటిగెంట్ ఎవ్వరి విషయంలోనూ చూపనంత సానుకూల వైఖరిని మీ పట్ల ఈ కోర్టు ప్రదర్శించింది. మీరు డిపాజిట్ చెల్లించకుంటే, తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది’’ అని జస్టిస్ దీపక్ మిశ్రా, రాజన్ గొగోయ్, ఏకే సిక్రీలతో కొత్తగా ఏర్పాటయిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. పెరోల్ పొడిగింపునకు రాయ్ తరఫు న్యాయవాది పదేపదే అభ్యర్థించిన నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ విధంగా స్పందించింది.