ఈ నెలాఖరుకల్లా పేటీఎమ్ చెల్లింపుల బ్యాంక్!
పేటీఎమ్ చీఫ్ విజయ్ శేఖర్ శర్మ
ముంబై: పేటీఎమ్ చెల్లింపుల బ్యాంక్ ఈ నెలాఖరు కల్లా కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలున్నాయి. ఆర్‌బీఐ నుంచి చెల్లింపుల బ్యాంక్ లైసెన్స్‌ను ఈ ఏడాది జనవరిలోనే పొందామని పేటీఎమ్ వ్యవస్థాపకులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. అన్నీ అనుకూలిస్తే ఈ నెలాఖరులోనే కార్యకలాపాలు ప్రారంభించగలమన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇక్కడ జరిగిన ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ బ్యాంక్ సేవలు అందుబాటులోకి రావాలని చెప్పారు. ప్రస్తుత రూపంలో ఉన్న బ్యాంకింగ్ రంగం పాతదైందని ఆయన వ్యాఖ్యానించారు. బ్యాంకింగ్ సౌకర్యాలు అందని కోట్లాది మందికి ఆర్థిక సేవలందించడంపైననే తమ చెల్లింపుల బ్యాంక్ దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు.
మొబైల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ విస్తృతంగా ఉన్నందున తమ వ్యాపారం మరింతగా వృద్ధి చెందుతుందని చెప్పారు. ఎస్‌బీఐకి 20.7 కోట్ల మంది ఖాతాదారులుండగా తమ పేటీఎమ్‌కు 21.5 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లున్నారని వివరించారు. పేటీఎమ్ ద్వారా నెలకు 20 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని, ఇతర ఈ–వాలెట్ల లావాదేవీలన్నీ కలిపి 19 కోట్లని శర్మ పేర్కొన్నారు. ఆన్‌లైన్ చెల్లింపులు, స్మార్ట్‌ఫోన్లను ప్రస్తావిస్తూ ఆయన ఏ వ్యాపారాన్ని అయినా తక్కువగా అంచనా వేయవచ్చని కానీ, టెక్నాలజీని అలా అంచనా వేయకూడదని చెప్పారు. టెక్నాలజీ అనేది సునామీలాంటిదని పేర్కొన్నారు. ఆన్‌లైన్ చెల్లింపులను మరింత విస్తరించాలంటే ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను, టెలికం కనెక్షన్లను మరింతగా మెరుగుపరచాలని ఆయన సూచించారు.